రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. చాలీచాలని కమీషన్లు, వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి అవకాశాలను పెంచే విధంగా పౌరసరఫరాల శాఖ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం రేషన్ షాపులను త్వరలోనే మినీ బ్యాంకులగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రేషన్ సరుకులను అందించే పౌర సరఫరా దుకాణాలు ఇకమీదట ఆర్థిక సేవలను కూడా అందించబోతున్నాయి. బిజినెస్ కరెస్పాడెంట్ల మాదిరిగా వ్యవహరించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కసరత్తులు ప్రారంభించింది. చాలీచాలని కమీషన్లతో ఇబ్బందులు పడుతున్న రేషన్ డీలర్లను ఆదుకుని, వారికి ఆదాయ మార్గలు చూపే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం రేషన్ షాపులను మినీ బ్యాంకులుగా మార్చే చర్యలు చేపట్టారు.
రేషన్ షాపులను మినీ బ్యాంకులుగా మార్చే విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల రేషన్ డీలర్ల సంఘం ముఖ్య నాయకులతో జిల్లా పౌరసరఫరాల శాఖ, పోస్టల్ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. రేషన్ షాపులను మినీ బ్యాంకులుగా మార్చడం ద్వారా డీలర్లు ఏ విధంగా ఉపాధి పొందవచ్చన్న దానిపై అవగాహన కల్పించారు. వీటిద్వారా నగదు లావాదేవీలు, ఉపాధిహామీ కూలీల చెల్లింపులు, ఆసరా పించన్ల నగదు చెల్లింపులు, విద్యుత్, ఫోన్ తదితర బిల్లులు చెల్లించవచ్చు. వీటిపై ప్రతి లావాదేవీకి రూ.4 చొప్పున, నెలలో రూ.5 లక్షలు దాటితే రూ.11 చొప్పున డీలర్లకు కమీషన్ చెల్లించనున్నారు.
బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాలలో ఈ సేవలు రేషన్ డీలర్లకు ఆర్థికంగా బాగానే ఉపయోగపడుతాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్యాంకింగ్ సేవల కోసం పట్టణాలకు, మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పని ఉండకపోగా.. డీలర్లకు అదనపు ఆదాయం అందించినట్టవుతుంది. ప్రస్తుతం రేషన్ డీలర్లు ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీతో బిజీగా ఉన్నా.. ఆ తరువాత రోజులల్లో ఖాళీగా ఉంటున్నారు. ఈ సమయాన్ని డిజిటల్ లావాదేవీలకు వినియోగించడంతో.. మరింత ఆదాయం పొందేలా చేయవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.