తెలుగు ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యుద్ధ వీరులకు రామ్ చరణ్ నివాళ్లు అర్పించారు. సికింద్రాబాద్‌లో శనివారం పరేడ్ గ్రౌండ్‌లో డిఫెన్స్ అధికారులు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అమర వీరులకు నివాళులు అర్పించి పుష్పగుచ్ఛం సమర్పించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాలు జరుపుకోవడం.. దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నిజంగా తనకు తక్కిన గొప్ప అదృష్టం అని అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు గుండెపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్నారంటే.. అక్కడ బార్డర్ లో సైనికుల రక్షణే కారణం అన్నారు. సైనికుల ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు. తాను ధృవ సినిమాలో ఆర్మీ అధికారిగా నటించడం గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.