ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ది చెందుతుంది. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నారు.. వైద్య శాస్త్రంలో మనిషి ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నా.. మూఢ నమ్మకాలను మాత్రం వదలడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో క్షుద్రపూజల పేరుతో మనుషులను నిలువునా దోచేస్తున్నారు.. అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది దొంగబాబాలు ఈజీ మనీ రెచ్చిపోతున్నారు. లంకెబిందెలు దొరుకుతాయని, ఆకస్మిక ధనలాభం కలుగుతుందని.. పూజల పేరుతో హడావుడి చేస్తూ అమాయకులను బురిడీ కొట్టించడమే కాదు.. చిన్నపిల్లలను బలి పేరుతో చంపేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పరిధిలో ఓ స్కూల్ లో క్షుద్రపూజల ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ పరిధిలో హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్రపూజలు జరిగినట్టు తెలుస్తుంది. సైన్స్ లాబ్, స్టోర్ రూమ్ లో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు తెలుస్తుంది. వింత ఆకారాల్లో బొమ్మలు, ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కోసి ఉంచడం చూసి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు భయంతో వణికిపోయారు.. స్కూల్ నుంచి పరుగులు పెట్టారని ఉపాధ్యాయులు తెలిపారు. అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు సీసీ టీవీ కెమరాలు పరిశీలించగా అవి కూడా మాయమయ్యాయి.
షాకోట్ స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని.. అసలు క్షుద్రపూజలు చేసింది ఎవరు? దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. గతంలో హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు గ్రహణం సంబవించిన సమయంలో జరిగాయి. ఓ శిశువును క్షుద్ర పూజల పేరుతో బలి ఇచ్చారు. సైన్స్ ఎంత అభివృద్ది చెందినా.. ఇప్పటికీ మూఢ నమ్మకాల పేరుతో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.