సాధారణంగా పోలీసులను చూడగానే ఓ రకమైన భయం కలుగుతుంది. ఏదైనా సమస్య ఉండి స్టేషన్‌కు వెళ్లాలంటేనే చాలా మంది భయపడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా భయం భయంగా బెరుగ్గా మాట్లాడతారు. మరికొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే.. పోలీస్ స్టేషన్ ఛాయలకు వెళ్లాలంటేనే భయపడిపోతారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కొందరు పోలీస్ స్టేషన్లకు వెళ్లి టీచర్లు, ఫ్రెండ్స్ మీద కంప్లైంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి నిత్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండేవాడు.. తల్లిదండ్రులు ఇద్దరు ఇలా గొడవపడటం ఆ పిల్లాడికి నచ్చలేదు. సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. చివరకు అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడు చూపిన తెగువకు అందరూ ఆశ్చర్యతపోతున్నారు. ఇక పోలీసులు బాలుడి తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ వివరాలు..
ఈ సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన దీపిక-బాలకిషన్ దంపతులు. వారికి ఇద్దరు సంతానం భరత్, శివానిలు ఉన్నారు. బాలకిషన్ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. అయితే గత కొంత కాలంగా అతడు మద్యానికి బానిస అయ్యాడు. పని మానేసి నిత్యం మద్యం తాగుతూ.. డబ్బుల కోసం భార్యను వేధిస్తుండేవాడు. అడ్డుకుంటే కొట్టి మరి డబ్బులు లాక్కెళ్లడం చేసేవాడు. అది చూసి కుమారుడు భరత్ నిత్యం బాధపడేవాడు. అడ్డుకుంటే వారిని కూడా కొట్టేవాడు. ఎలాగైనా ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఏం చేస్తే తండ్రి మారాతాడా అని ఆలోచించసాగాడు భరత్.
ఈ క్రమంలో ఆ చిట్టి బుర్రలోకి ఓ ఐడియా వచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టాడు. తమ ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడు ధైర్యాన్ని చూసి పోలీసులు ముచ్చటపడ్డారు. స్టేషన్‌కు వెళ్లి ఇలా ఫిర్యాదు చేయాలని నీకెవరు చెప్పారు.. ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించగా.. ఆ పిల్లాడు చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు.
‘‘తప్పకుండా నాకు నమ్మకం ఉంది. పోలీసులు ప్రజలకు మంచే చేస్తారు కదా సార్.. మా నాన్నకు మీరైనా చెప్పండి సార్.. తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు’’ అని ఫిర్యాదు చేశాడు. ఆ చిన్నారి తెగువ, ధైర్యాన్ని చూసి ముచ్చటపడ్డ ఎస్సై అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకుని అభినందించాడు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులను పిలపించి.. కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇలాంటివి మళ్లీ జరగవద్దని హెచ్చరించి ఇంటికి పంపించారు. చిన్నారి చూపిన తెగువపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.