రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం షురూ అయిపోయింది. హైదరాబాద్ మహా నగరం ఇప్పటికే బోసిపోయినట్లుగా కనిపిస్తోంది. అంతా పండగకు ఊర్లు వెళ్లడం మొదలు పెట్టేశారు. ఇప్పటికే సగం సిటీ ఖాళీ అయిపోయింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ, రైల్వేతో పాటుగా ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఫుల్ రష్ గా ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులు వేసినట్లు ప్రకటించింది. ఊర్లకు వెళ్లే వాళ్లకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు 10 శాతం రాయితీ కూడా కల్పించామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి సిటీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సాధ్యమైనంత వరకు ప్రయాణికులకు అవాంతరాలు రాకుండా చూసుకుంటామన్నారు.
అటు ఏపీ ప్రభుత్వం కూడా పండగ దృష్ట్యా ఏర్పాట్లు చేసింది. అదనపు బస్సులు, స్పెషల్ బస్సులకు సైతం అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అటు ప్రైవేటు ట్రావెల్స్ కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా టికెట్ మీద ఎక్కువ డబ్బులు అడిగితే ఫిర్యాదులు చేయాలని చెప్పారు. ఎక్కువ డబ్బులు అడిగే వారిపై తనిఖీలు చేసి చర్యలు కూడా తీసుకున్నారు.
ఇలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రైవేటు దందా ఆగడంలేదు. హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు రూ.3 వేల వరకు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వాపోతున్నారు. పండగవేళ ఇంటికి వెళ్లాలంటే ప్రైవేటు బస్సుల వసూళ్లకు నలిగిపోతున్నామంటున్నారు. ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబం ఇంటికి వెళ్లాలంటే నెల జీతం సరిపోదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని చాలా ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.