హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మలక్ పేట్ లోని ఓ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించగా.. తాజాగా ఓ ట్రావెల్ బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. కూకట్ పల్లి జేఎన్టియూ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సులోంచి ఒక్కసారిగా బస్సులోంచి మంటలు చెలరేగాయి. మెట్రో స్టేషన్ కింద బస్సు తగలబడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందివ్వడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శనివారం రాత్రి 9.30, 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మెట్రో స్టేషన్ వద్ద ఖాళీ ప్రదేశంలో బస్సుని పార్కింగ్ చేశారు. కూకట్ పల్లి నుంచి జేఎన్టియూ మీదుగా మియాపూర్ వెళ్లాల్సి ఉంది. అక్కడ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని ఆంధ్రా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణికులను ఎక్కించుకోవడానికి మియాపూర్ బయలుదేరే కొన్ని నిమిషాల ముందు బస్సు ఉన్నట్టుండి మంటలు వచ్చి తగలబడిపోయింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేరు. కానీ డ్రైవర్, ఇద్దరు సహాయకులు ఉన్నారు. బస్సులోంచి మంటలు రావడంతో వారు అప్రమత్తమై వెంటనే బస్సు దిగేశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Kaveri Travels Bus fire accident at Nizampet now pic.twitter.com/jkaCeNeOTy
— Abhishekt Bhargav (@AB8_Exile) January 7, 2023
అప్పటికే బస్సు దాదాపు కాలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఇంకొంచెం ఆలస్యంగా మంటలు వచ్చినా.. లేదంటే డ్రైవర్లు కొంచెం ముందుగా బస్సు పోనిచ్చినా.. ప్రయాణికులకి ప్రమాదం జరిగి ఉండేదని.. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న బస్సు కాలిపోయింది కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. బస్సు కాలుతున్నప్పుడు కొంతమంది వీడియో తీశారు. ఓ వ్యక్తి దీన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నిజాంపేట్ దగ్గర కావేరి ట్రావెల్స్ బస్ ఫైర్ యాక్సిడెంట్ కి గురైందంటూ ట్వీట్ చేశాడు.