గుండెపోటు.. ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. సీమంతం కోసం మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆమె అనుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. అప్పటివరకు మన ముందు ఎంతో ఆనందంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల సైతం గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు ఎప్పుడు, ఎవరిని కాటేస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలావుంటే.. నగరంలో గుండెపోటుతో ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. ఆ వివరాలు..
హైదరాబాద్, తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్, కల్పన భార్యభర్తలు. హేమంత్ ప్రైవేట్ ఉద్యోగి కాగా.. ఆయన భార్య కల్పన(28) ఇంటి వద్దనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. అయితే, ఏడవనెల దగ్గరపడుతుండటంతో సీమంతం నిమిత్తం ఆమెను 15 రోజుల క్రితం సంజీవయ్యనగర్ లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు పంపించారు. అప్పటినుండి అక్కడే ఉంటున్న ఆమె గురువారం ఉదయం బాత్‌రూమ్‌లో జారి కిందపడింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇది గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగా.. ఫిట్స్ రావడంతో ప్రాణాలు కోల్పోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు వెల్లడించారు. కల్పనతో పాటు కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోడంతో వారి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. భార్య కాళ్ల వద్ద కూర్చొని కల్పన.. కల్పన.. అంటూ ఆమె భర్త రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనమూ కోరుకుందాం..