ఏఐసీసీ కీలక నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 52వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. నేడు ఈ పాదయాత్ర మహబూబ్ నగర్ మీదుగా జడ్చర్ల వరకు కొనసాగనుంది. పాదయాత్ర సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇక రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నటి పూనమ్ కౌర్ రాహుల్ పాదయాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు.
పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్.. రాహుల్ గాంధీతో కలిసి కొంత దూరం నడిచారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికుల సమస్యల గురించి రాహుల్ గాంధీతో చర్చించారు. చేనేత కార్మికుల సమస్యల గురించి.. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కోరినట్లు పూనమ్ కౌర్ వెల్లడించారు. అంతేకాక చేనేత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్‌ను కోరానని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని ఆమె తెలిపారు. పూనమ్ కౌర్ రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.