హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ చిన్నారి కుటుంబాన్ని పలువురు నటులు, రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చిన్నారికి న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు షర్మిల తల్లి విజయమ్మ కూడా అక్కడకు చేరుకున్నారు. కూతురితో పాటు దీక్షలో కూర్చున్నారు. తాజాగా షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షా స్థలికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్టీపీ శ్రేణులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం షర్మిల దీక్షను భగ్నం చేసి అక్కడి నుంచి తరలించారు.
అంతకు ముందు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఇంత మంది అధికారులు, అధికార నేతలు ఉన్న ఈ నగరంలో ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా ఎవరూ సరైన రీతిలో స్పందించడం లేదని.. ముఖ్యంగా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ నోరు విప్పి బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, మహిళలపై లాఠీచార్జ్ చేసి చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లారని ఆరోపించారు. ఏది ఏమైనా చిన్నారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదు అంటున్నారు వైఎస్ షర్మిల.