సైదాబాద్ చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడి రాజు ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని మానవ మృగం రాజు అత్యాచారానికి పాల్పడి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 9 నుంచి పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడు అత్యాచారం, హత్య చేసిన తర్వాత పోలీసు కన్నుగప్పి తిరుగుతున్న నేపథ్యంలో అతన్ని పట్టుకునేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. అన్ని జిల్లాలలను అప్రమత్తం చేశారు.. నిందితుడి చిత్రాలతో పాటు, ఊహా చిత్రాలను కూడా విడుదల చేసి అలర్ట్ చేశారు. ఇంతలోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో రాజు స్టేషన్ ఘన్‌పూర్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం శవమై తేలాడు. రాజు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. కానీ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా రాజు కుటుంబ సభ్యులు పోలీసులే తమ కొడుకును తీసుకు వెళ్లి పరుగెత్తించి మరీ చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని లక్ష్మణ్ కోర్టును కోరారు. రాజు మరణం వెనుక నిజానిజాలు ఏంటో తెలియాలంటే న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో సర్వత్రా ఆసక్తిరేపుతోంది.