నమ్మకంగా మన మధ్యే తిరుగుతూ, మాయమాటలు చెప్పి, చాలా చాకచక్యంగా డబ్బులు గుంజుకుంటున్నారు కొంత మంది కేటుగాళ్లు. వడ్డీకి ఇస్తే ఒక రూపాయి వస్తుందని ఆశపడ్డ వారు.. అప్పు ఇచ్చి..తిరిగి డబ్బులు తీసుకునే క్రమంలో నానా అగచాట్లు పడుతున్నారు.
మోసాలకు సరికొత్త దారులు వెతుకున్నారు కేటుగాళ్లు. నమ్మకంగా మన మధ్యే తిరుగుతూ, మాయమాటలు చెప్పి, చాలా చాకచక్యంగా డబ్బులు గుంజుకుంటున్నారు. ఇదిగో వెంటనే చెల్లిస్తామంటూ పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకుని.. డబ్బులు తిరిగి చెల్లించ సమయానికి మోహం చాటేస్తున్నారు. వడ్డీకి ఇస్తే ఒక రూపాయి వస్తుందని ఆశపడ్డ వారు.. అప్పు ఇచ్చి..తిరిగి డబ్బులు తీసుకునే క్రమంలో నానా అగచాట్లు పడుతున్నారు. కొన్నాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడమే కాదూ.. కుటుంబంతో సహా ఉడాయించేస్తున్నారు. అప్పటికి గానీ బోధపడటం లేదు తాము మోసపోయామని.. ఆపై లబోదిబోమంటున్నారు.
బ్రతుకు తెరువు కోసం సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఓ ఆర్ఎంపి వైద్యుడు.. నమ్మబలికి కోటికిపైగా మోసానికి పాల్పడ్డాడు. ఈఘటన వేముల వాడ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కలకత్తాకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ .. 20 ఏళ్ల క్రితం వేములవాడ పట్టణానికి వచ్చాడు. మొదటి బైపాస్ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం సమీపంలో మొలలకు చికిత్స అందిస్తున్నానంటూ క్లినిక్ పెట్టుకొని కొంతకాలంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. కుటుంబంతో ఉంటున్న సదరు ప్రైవేట్ వైద్యుడు .. వైద్యం పేరుతో అందరితో పరిచయాలు పెంచుకొని సన్నిహితంగా మెలగసాగాడు. అయితే తాను సొంత ఇంటిని నిర్మించుకుంటున్నానని చెప్పి నాలుగు, ఐదు మాసాలుగా డబ్బులు వసూలు చేస్తున్నాడు.
అధిక వడ్డీ చూపించి.. ఇల్లు పూర్తయ్యాక ఇచ్చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మిన కొందరు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరి దగ్గర నుండి 5 నుండి 10 లక్షల వరకు దాదాపు 12మంది దగ్గర అప్పు చేశాడు. అతడి దగ్గర వైద్య సేవలు పొందిన వారు, చుట్టు ప్రక్కల వారు దాదాపు కోటిన్నర నగదు ఇచ్చారు. ఇటీవలే కొందరు తమకు డబ్బులు కావాలని తిరిగి వెళ్లి అడగడంతో కలకత్తాలో తన భార్య పేరిట ఆస్తులు ఉన్నాయని అమ్మి తీసుకువచ్చి ఇస్తానని నమ్మించాడు. తాను ఇక్కడే ఉంటానని, తన భార్య, పిల్లలు మాత్రమే కలకత్తా వెళ్లి తీసుకు వస్తారంటూ చెబుతూ రోజులు గడిపాడు. ఒక రోజు కుటుంబం మొత్తంతో ఉడాయించాడు. వీరి జాడ కానరాకపోవడంతో మోసపోయామని భావించిన వారు ఏడ్చుకుంటూ పోలీసులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.