జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో ఎన్నికల ప్రచార రథానికి సంబంధించిన ఫోటో, వీడియో షేర్ చేస్తూ.. ఎన్నికలకు వారాహి సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వెల్లువెతుతున్నాయి. వారాహి వాహనానికి ఉపయోగించిన ఆలివ్ గ్రీన్ రంగు చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. మిలటరీ వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు ఆలివ్ గ్రీన్ రంగుని ఉపయోగించడానికి అనుమతి లేదని, అలాంటప్పుడు ఎలా ఉపయోగించారంటూ వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం 1989 ఛాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ ఆలివ్ గ్రీన్ రంగు వాహనాలను వాడకూడదని స్పష్టంగా ఉంది. దీంతో వారాహి వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
తెలంగాణ రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ అధికారులు కొన్ని కారణాల వల్ల వారాహి రిజిస్ట్రేషన్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. లారీ ఛాసిస్ ను బస్సుగా మార్చడం.. వాహనం ఎత్తు ఎక్కువగా ఉండడం, మైన్స్ లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్లపై వాడడం వంటివి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన ఆలివ్ గ్రీన్ కలర్ ని వాహనానికి వేయడం ఇవన్నీ రిజిస్ట్రేషన్ అనర్హతగా పరిగణించినట్లు వార్తలు వస్తున్నాయి. నిబంధనలను విరుద్ధంగా వారాహి ఉన్న కారణంగా రిజిస్ట్రేషన్ తిరస్కరించినట్లు తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా వాహనాన్ని మార్చుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో వారాహి వాహన రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.