ప్రజా గాయకుడు, విప్లవ వీరుడు, తెలంగాణ పోరు బిడ్డ గద్దర్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన అంత్యక్రియలు అల్వాల్ జరగనున్నాయి.
ప్రజా గాయకుడు, యుద్దనౌక గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో సైతం ఆయనకు మంచి పేరు ఉంది. ప్రజా గాయకుడిగా, విప్లవకారుడిగా ఉద్యమ నేతగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు గద్దర్. నిన్న హైదరాబాద్ అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్నతర్వాత యావత్ తెలంగాణ ప్రజానికం, రాజకీయ, సినీ రంగానికి చెందినవారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. గద్దర్ అంటే ఎంతోగొప్పగా అభిమానించేవారు.. ఆయన పార్థీవ దేహం వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. తాజాగా పవన్, గద్దర్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ప్రజాగాయకుడు గద్దర్ (74) నిన్న అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ పోరు బిడ్డ, యుద్దనౌక గద్దర్ అమర్ హై అంటూ ఆయన అభిమానులు జోహార్లు చెబుతున్నారు. కొద్దిసేపట్లో ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ లోని గద్దర్ నివాసం వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఇప్పటికే ఆయన పార్థీవ దేహాన్ని పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, కళాకారులు, అభిమానులు సందర్శించుకొని నివాళులు అర్పించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ .. గద్దర్ అంటే ఎంతగానో అభిమానించేవారు.. వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి గద్దర్ భావజాలం అంటే ఎంతో ఇష్టపడేవారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే గద్దర్ మరణ వార్త విని వెంటనే హైదరాబాద్ కి వచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబాన్ని పరామర్శించాడు. ఈ సందర్భంగా గద్దర్ తనయుడుని పట్టుకొని కన్నీటిపర్యంతం అయ్యారు.
గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘గద్దర్ అపోలో ఆస్పత్రిలో ఉన్న సమయంలో తనకు వాయిస్ మెసేజ్ పంపారని.. ఆరోగ్యంతో తిరిగి వస్తారని అనుకున్నా.. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్తారని ఊహించలేదు. భూమి కోసం.. భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం.. తన గళంతో ఉద్యమ స్పూర్తినందించి గొప్ప గాయకుడు, కవి గద్దర్. ఆయన మాటలు సైతం పాటలుగా ఉంటాయి.. పీడిత ప్రజల పక్షాన పోరాడే గద్దర్ అన్న అంటే నాకు ప్రాణం, అలాంటి వారితో ఎక్కువ సమయం గడపడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో స్ఫూర్తి కలిగించారు.. శ్రీశ్రీ తర్వాత గద్దర్ అన్న ప్రభావమే నాపై ఎక్కువగా పడింది. చివరి శ్వాస వరకు ప్రజల కోసం వారి మేలు కోసం పోరాడిన గొప్ప మనిషి. చివరిసారి ఆయన నా పాటకు గాయం అయ్యిందని చెప్పినపుడు ఎంతో బాధపడ్డాను ’అంటూ ఎమోషనల్ అయ్యారు.
గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఓ మీడియాలో గద్దర్ మాట్లాడుతూ.. తను అంటే నాకు ఎంతో ఇష్టమని.. నాకు తమ్ముడిలాంటి వాడని అన్నారు. నాకు ఏదైనా ఆర్ధిక కష్టాలు ఉంటే నేరుగా వెళ్లి పవన్ కళ్యాణ్ జేబులో చేయి పెట్టి మరీ డబ్బులు తీసుకునే అంత చొరవ ఉంది అని పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.