బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఇలా ఓ తండ్రి కొడుకు మీద తనకు ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నాడు. చనిపోయిన కొడుకు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ప్రేమను చాటుకున్నాడు.
పెళ్లయిన ప్రతివారికి సంతానం కలగాలనే కోరిక ఉంటుంది. ఆలుమగల ఆప్యాయత, ప్రేమకు ప్రతిస్వరూపమే పిల్లలు. సంతానం కలిగిన వారు దాన్ని ఆస్వాదిస్తే.. పిల్లలు లేని వారు అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సంతానం కలగాలని దేవుళ్లకు మొక్కుతుంటారు, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. పిల్లలు పుడితే వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. పిల్లలకు ఏదైనా బాధ వస్తే వారి కంటే ముందు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. కన్నప్రేమ అలాంటి మరి. తమ సంతానానికి చిన్న బాధ కలిగితేనే తట్టుకోలేని పేరెంట్స్.. వారు తమకు శాశ్వతంగా దూరమైతే అస్సలు తట్టుకోలేరు. ఆ బాధ నుంచి బయటపడటం అంత సులువు కాదు.
పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాదు. అలా తమ సంతానాన్ని కోల్పోయిన పేరెంట్స్ కథే ఇది. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, శంకర్తండాకు చెందిన భూక్యా బీకోజీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. ఆయన కుమారుడు భూక్యా సిద్ధు (7) రెండేళ్ల కిందట కరెంట్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క మగ సంతానాన్ని మృత్యువు తీసుకెళ్లిపోవడంతో తల్లడిల్లిపోయారు బీకోజీ దంపతులు. ఆ బాధ నుంచి కోలుకునేందుకు వారికి చాలా కాలం పట్టింది. సోమవారం కొడుకు సిద్ధు రెండో వర్దంతి సందర్భంగా విగ్రహాన్ని తయారు చేయించి తన వ్యవసాయ భూమి వద్ద ప్రతిష్టించారు. తండా పెద్దలతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.