మారుమూల గ్రామాల్లోనే వైద్యం చేస్తే ఫీజు కింద కనీసం రూ. 50 నుంచి రూ. 100 తీసుకుంటున్నారు డాక్టర్లు. అలాంటిది ఒక్క రూపాయికే వైద్యం అందించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ కార్పొరేట్ వైద్యం.. పైగా హైదరాబాద్ లాంటి నగరంలో. ఎవరయ్యా ఆ మహానుభావుడు? కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లాలంటే ఇవాళ అపాయింట్మెంట్ కే వెయ్యి, 1500 లకు పైన ఉంటుంది. ఇక వైద్య పరీక్షలు, మందులకు అంటే పేదవారు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అసలు కార్పొరేట్ వైద్యం అంటే పేదవారికి అందని ద్రాక్ష. అలాంటి కార్పొరేట్ వైద్యాన్ని ఒక్క రూపాయికే పేద ప్రజలను అందజేస్తున్నారు.
ఒక్క రూపాయికే వైద్యమా? ఎవరు చేస్తారండి ఈరోజుల్లో? వైద్యం కార్పొరేట్ మయం అయిపోయిన ఈరోజుల్లో ఒక్క రూపాయికే వైద్యం చేసేవాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా అతను డాక్టర్ మాత్రం కాదు, భగవంతుడు అయి ఉంటారని అనుకుంటున్నారా. భగవంతుడు కాదు కానీ సాక్షాత్తు భగవంతుని స్వరూపం. మనుషుల్లో దేవుడు ఉంటాడు అని అనడానికి నిదర్శనం. ఆయనే నైన్ స్టార్ గ్రూప్ ఛైర్మన్ పైడీ రాకేష్ రెడ్డి. ఇతను డాక్టర్ కాదు. కానీ తోటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవాలన్న సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన వ్యక్తి. తన ఎదుగుదలలో ఈ సమాజం యొక్క భాగస్వామ్యం ఉందని తెలిసి.. తన వంతు సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఇలా ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం అందించేందుకు సిద్ధమయ్యారు.
కొంతమంది వచ్చిన దారిని మర్చిపోరు. తాము ఏమీ లేని స్థితిలో ఎన్ని కష్టాలు పడ్డారో.. తమలా ఇంకెవరూ కష్టపడకూడదని ఆలోచిస్తారు. తమ శక్తికి తగ్గట్టు తోటి మనుషులకు సాయం చేస్తుంటారు. అలాంటి వారిలో ఈ రాకేష్ రెడ్డి ఒకరు. కోల్డ్ స్టోరేజ్, హోటల్స్ ఇలా వివిధ వ్యాపారాలు కలిగిన ఈయన వచ్చిన డబ్బులో విద్య, వైద్యం కోసం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. పైడీ రాకేష్ రెడ్డి ఫౌండేషన్ పేరుతో కార్పొరేట్ వైద్యాన్ని కేవలం ఒక్క రూపాయికే అందించే దిశగా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలతో వేల మందికి సహాయం చేసిన రాకేష్ రెడ్డి పేదల కోసం ఒక్క రూపాయికే వైద్యం అందించే హాస్పిటల్స్ ని కొత్తగా తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోని జీజీ ఛారిటబుల్ ట్రస్టు వారితో అసోసియేట్ అయ్యి ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్నారు. పేదవారికి అందుబాటులో ఉండేలా కార్పొరేట్ వైద్యాన్ని ఒక్క రూపాయి కన్సల్టేషన్ ఫీజుతో అందిస్తున్నారు. వైద్యం మాత్రమే కాదని.. వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు కూడా పేదవారు భరించేంత చిన్న అమౌంట్ కే అందిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఈ ఒక్క రూపాయి వైద్యాన్ని ఏపీలో కూడా తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఉన్న ప్రజలకు అందించాలని భావిస్తున్నారు. ప్రజల ఋణం తీర్చుకునేందుకే ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. మరి ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.