రోడ్డు వెడల్పుకు అడ్డొచ్చాయని మహనీయుల విగ్రహాలు తొలగింపు చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. తెలంగాణ నూతన సచివాలయం ముందే జరిగింది. ఈ చర్యలపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నూతన సచివాలయం ముందున్న తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహలను అధికారులు తొలగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడల్పులో భాగంగా విగ్రహాలను తొలగించామని అధికారులు చెప్తున్నారు. అయితే తొలగించిన ఈ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠిస్తామని గానీ, అంతకంటె మిన్న అయిన ప్రాంతంలో పెడతామని గానీ ఒక్క ప్రకటన కూడా రాకపోవడం వివాదానికి కారణమవుతోంది.
ట్యాంక్ బండ్ పరిసరాల్లోని తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగించడంపై పలువురు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే అది పొట్టి శ్రీరాములు త్యాగఫలితమే అని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని తొలగించడం అవివేకమైన చర్యగా వారు సూచిస్తున్నారు. అలాగే తెలుగుజాతికి ప్రతీక, తెలుగు భాషా ఔన్నత్యానికి చిహ్నమైన తెలుగుతల్లి విగ్రహ తొలగింపును వారు ఖండించారు. తెలుగుతల్లికి తెలంగాణ వారందరూ కూడా సొంత బిడ్డలే అని ఈ క్రమంలో వారు ప్రభుత్వానికి తెలియజేశారు. రోడ్డు వెడల్పు పేరుతో మహనీయుల విగ్రహాలు తొలగింపు చర్యలు సమంజసమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.