మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాగి వాహనాన్ని నడుపుతూ.. తొలిసారి పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష వేస్తున్నారు. అలాగే.. తరుచూ పట్టుబడుతున్న వారికి జైలుశిక్షతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తున్నారు. అయితే.. మద్యం మత్తులో వాహనం నడుపుతూ తొలిసారి పోలీసులకు పట్టుబడిన వారికి తీపి కబురు చెప్పారు పోలీసులు. తొలిసారి ఇలాంటి కేసుల్లో చిక్కిన వారికి ఉపశమనం కలిగించే విషయం చెప్పారు. ప్రస్తుతానికి జైలుశిక్షలు కాకుండా కేవలం జరిమానాతో సరిపెట్టేలా ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెల 12న మెగా లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని ఇలాంటి కేసులను కొలిక్కి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా, తొలిసారిగా పట్టుబడిన వాహనదారులకు జరిమానా విధించేందుకు నగర పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. మార్చి 12న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పెండింగ్ కేసులు ఓ కొలిక్కి రానున్నాయి. నగరంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల జాబితాను తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎల్‌ఎస్‌ఏ) ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినందున పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ లోక్ అదాలత్‌లో విచారించనున్నారు. ఇప్పటివరకు తొలిసారి చిక్కినా సరే రూ.10వేల జరిమానాతో పాటు మందుబాబుల రక్తనమూనాల్లో ఉన్న మద్యం నిల్వల మోతాదును బట్టి జైలుశిక్ష విధించేవారు. తాజా నిర్ణయంతో ఇలాంటివారు సదరు మోతాదు ఎంత ఉన్నా కూడా రూ.2 వేల జరిమానాతో బయటపడే వెసులుబాటు లభిస్తోంది.2016 నుండి దాదాపు 1.5 లక్షల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 1 లక్ష మంది మొదటిసారిగా పట్టుబడ్డారని చెప్పారు. ఇదిలా ఉండగా, 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2,300 కోట్ల జరిమానా వసూలు కాగా.. వార్షిక చెల్లింపులు 30-40 శాతానికి మించకపోవడంతో సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారు. అందులో 50 శాతం చెల్లిస్తే జరిమానా మాఫీ చేసేలా చర్యలు తీసుకున్నారు.