Sneha: శ్రమ మన ఆయుధమైతే.. విజయం మన బానిసవుతుంది. మంచి మనసుతో అలుపెరుగని కృషి చేస్తే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించొచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నిజమాబాద్‌కు చెందిన స్నేహ. ఎన్ని ఓటములు ఎదురైనా కష్టాన్ని.. ఇష్టంగా మార్చుకుని చివరకు సివిల్స్‌లో ర్యాంకు సాధించారు. వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అరుగుల స్నేహ తన తల్లి పద్మ, చెల్లెలు సుప్రియలతో అక్కడి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి కలెక్టరేట్‌లో ఉద్యోగి కాగా, చెల్లెలు మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తున్నారు. స్నేహ మాత్రం 8వ తరగతినుంచే సివిల్స్‌లో ర్యాంకు సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
2017లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సివిల్స్‌పై దృష్టి పెట్టారు. ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నారు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌కు అర్హత సాధించలేకపోయారు. రెండో ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లారు. మూడో సారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఒక్క మార్కుతో ర్యాంకు కోల్పోయారు. అయితే, ఎన్ని జరిగినా.. ఏమి జరిగినా ఆమె పట్టువదలలేదు. నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. 136 ర్యాంకు పొందారు.తన విజయంపై స్నేహ స్పందిస్తూ.. తన తల్లికి ఇచ్చిన మాట కోసం సివిల్స్ సాధించటం గర్వంగా ఉందని అన్నారు. ఓటమితో నిరాశపడటం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అనుకున్నది సాధించటానికి ఏకాగ్రత, పట్టుదల ఉంటే విజయం చాలని పేర్కొన్నారు. మరి, స్నేహ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vikarabad: HDFC అకౌంట్‌లో జమైన రూ. 18 కోట్లు.. షాక్ అయిన కస్టమర్..