ఈ హైటెక్ జమానాలోనూ స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం కనిపించడం లేదు. పుట్టింది మగైనా, ఆడైనా సమానంగా చూడాలనే మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆడబిడ్డ పుడితే ఆర్థిక సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారో గ్రామ సర్పంచ్.
పుట్టిన పిల్లలు ఆడైనా, మగైనా సమానంగానే చూడాలి. కానీ ఆ సమానత మాటల్లోనే కనిపిస్తుంది. ఆడ, మగ సమానమని ఎంత చెప్పినా.. అవన్నీ మాటలవరకే పరిమితం అవుతున్నాయి. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ తేడాను చాలా మంది చూపిస్తుంటారు. ముఖ్యంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా చూడొచ్చు. మగ పిల్లాడు వారసుడంటూ గారాబం చేస్తూ పెంచేవాళ్లు ఎందరో ఉన్నారు. ఆడపిల్లను తలకు భారం అనుకుని త్వరగా పెళ్లి చేసి పంపించేయాలని భావించేవారూ ఉన్నారు. అయితే ఆడపిల్లలను కాపాడుకునే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర సర్కారులు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.
ఈ కోవలో ఒక గ్రామ సర్పంచ్ కూడా తనవంతుగా ఏదైనా చేయాలని సంకల్పించారు. గ్రామంలో ఆడబిడ పుట్టిన ప్రతి కుటుంబానికి రూ.5 వేలు అందిస్తున్నారు. ఆమెనే నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి మండలం, సుద్ధపల్లి గ్రామ సర్పంచ్ పి. రూప సతీష్ రెడ్డి. ఆడపిల్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ సర్పంచ్ దంపతులు తమ మంచి మనసు చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ‘బేటి బచావో.. బేటి పడావో’ నినాదానికి ఆకర్షితులైన ఈ సర్పంచ్ దంపతులు.. ఆడబిడ్డను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదువునిద్దాం అంటూ ఛారిటీ వైపు కదిలారు. ఈ ఏడాది జనవరి 26 నుంచి గ్రామంలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా వారికి రూ.5 వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. సాయం చేయాలంటే తపన ముఖ్యమని ఈ సర్పంచ్ దంపతులు అంటున్నారు.