ర్యాగింగ్ అనేది ఇన్నాళ్లు కళాశాలల్లో వినిపించకపోయినా.. ఇప్పుడు మాత్రం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఓ నర్సింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ అంటూ వార్తలు కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా కళాశాలల్లో సీనియర్లు జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. కానీ, కొన్ని విషాద ఘటనల తర్వాత ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వాలు చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకున్నాయి. ఏ కళాశాలలో అయినా ర్యాగింగ్ పేరు వినిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించాయి. ఇన్నాళ్లు ఈ ర్యాగింగ్ కు సంబంధించి పెద్దగా ఘటనలు లేకపోయినా కూడా ఇప్పుడు చాపకింద నీరులా ర్యాగింగ్ భూతం మరోసారి జడలు విప్పుతోంది. వరంగల్ ఎంజీఎం మెడికో ప్రీతి మృతికి ఇలాంటి వేధింపులే కారణమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నర్సింగ్ కాలేజ్ లో ర్యాంగింగ్ పేరిట వేధింపులు వెలుగుచూశాయి. అయితే ఇక్కడ అమ్మాయిలు మాత్రం ఎంతో ధైర్యంగా వాటిని తిప్పికొట్టారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని నర్సింగ్ డెంటల్ కాలేజీలో ఈ ర్యాగింగ్ వెలుగు చూసింది. ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్స్ అమ్మాయిలతో చెప్పుకోలేని విధంగా కామెంట్స్ చేయడం, కాలితో తన్నడం చేశారని ఆరోపించారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. చివరికి తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం కాలేజీలో ఉండగానే అందరూ చూస్తుండగా కాలేజ్ నుంచి సీనియర్ విద్యార్థులను పోలీసులు తీసుకెళ్లారు. ఇద్దరు విద్యార్థులను క్లాస్ రూమ్ కి వెళ్లి పోలీసు జీపు ఎక్కించుకెళ్లారు. ఆ ఇద్దరినీ పోలీసులు తీసుకెళ్తుండగా.. అమ్మాయిలు వారిని చెప్పులతో కొట్టారు. కాలేజీలోకి బయటి వ్యక్తులు వస్తున్నారన్నా, సీనియర్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. యాజమాన్యం కూడా సీనియర్లకే సపోర్ట్ చేస్తూ.. మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ర్యాగింగ్ పేరుతో చెప్పుకోలేని మాటలు అన్నారని.. అమ్మాయిలను కాళ్లతో కూడా తన్నారంటూ ఆరోపించారు. ర్యాగింగ్ విషయంలో ఈ అమ్మాయిలు చూపించిన ధైర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.