తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల గురించి తెలిస్తే హృదయం తల్లడిల్లిపోతుంది. కొంత మంది దయార్థ హృదయులు అలాంటి చిన్నారులను ఆదుకుంటున్నారు. సామాజిక సేవా కార్యకర్తలు అలాంటి చిన్నారులను చేరదీసి అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తాజాగా ఓ కలెక్టర్ అనాథగా ఉన్న ఓ చిన్నారిని ఆదుకొని తన మంచి మనసు చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి తల్లి మంగళవారం అనారోగ్యంతో చనిపోయింది. అంతకు ముందే ఆ చిన్నారి తండ్రి కూడా మృతి చెందాడు. ఐదేళ్ల ఆ చిన్నారి తన తల్లి వద్ద కూర్చొని సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్న సమయంలో చిన్నారి ఫోటో తీసి గంటెపాక శ్రీకాంత్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ‘ప్రభుత్వం ఈ ఐదేళ్ల చిన్నారి బాధ్యతలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని’ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు. ట్విట్టర్ లో ఆ నెటిజన్ పంపిన పోస్ట్ చూసి పట్టణాభివృద్ధి, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.. మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీకి ట్యాగ్ చేసి చిన్నారి బాగోగులు చూడాలని ట్వీట్ చేశారు. దీంతో కలెక్టర్ సహా, జిల్లా యంత్రాంగం ఎడ్‌బిడ్ గ్రామానికి వెళ్లి చిన్నారిని కలిసి పరామర్శించారు.
ఐదేళ్ల చిన్నారి రోషిణితో మాట్లాడారు కలెక్టర్ ముషారఫ్ అలీ. నీ పేరేంటి అని ప్రశ్నించగా.. రోషిణి అని సమాధానం చెప్పింది. నువ్వు స్కూల్‌కెళ్తున్నవా.. అనగా ఆ పాప అంగన్‌వాడీకి వెళ్తున్నానని చెప్పింది. మీ అంగన్‌వాడీ టీచర్ ఎవరు.. అనగా.. అగో ఆమెనే.. అని చూపించింది. ఆ చిన్నారిని ఎత్తుకొని ఎంతో ధైర్యం చెప్పారు కలెక్టర్. అనంతరం కలెక్టర్ ముషారఫ్ అలీ మాట్లాడుతూ.. రోషిణి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. శిశు సంరక్షణ అధికారులతో మాట్లాడి, రోషిణిని ఆదిలాబాద్‌లోని శిశు గృహానికి తరలించారు.గ్రామస్తులు దాతల ద్వారా సేకరించిన రూ.1.80 లక్షల విరాళాన్ని అందజేశారు. ఇక మంత్రి కేటీఆర్ కూడా కలెక్టర్ చేసిన సాయంపై స్పందించారు. కలెక్టర్ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చిన గంటెపాక శ్రీకాంత్‌ను ఆ జిల్లా ప్రజలు, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Request @WCDTelangana and @Collector_NML to take full care of this child’s well-being https://t.co/kDOqgnOPV3
— KTR (@KTRTRS) November 17, 2021
Many thanks Collector Garu 👍 https://t.co/9LDueudg6Q
— KTR (@KTRTRS) November 17, 2021