చాలామంది కలలు కంటారు.. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు. వాటిని సాకారం చేసుకునే క్రమంలో చాలా మంది సాకులు చూపిస్తూ తప్పించుకుంటారు. కానీ, అలేఖ్య మాత్రం తన జీవితంలో ఎంతో విషాదం చూసినా ఎదిరించి నిలబడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
జీవితంలో అనుకున్నది సాధించాలన్నా.. లక్ష్యాలను చేరలన్నా ఎంతో కష్టపడాలి. అందుకోసం అలుపెరగని యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి కోరుకున్నది సాధించడానికి పెద్ద ఇబ్బందులు ఉండవు. కానీ, వారు విజయాన్ని వాయిదా వేసేందుకు ఎక్కడలేని కారణాలను చెబుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల ఉన్నవాళ్లు మాత్రం సాకులు వెతకరు.. కన్నీళ్లను కూడా లక్ష్యాన్ని సాధించేందుకు ఇంధనంగా వాడుకుంటారు. అలాంటి కోవకు చెందిందే అలేఖ్య. ఆమె జీవితంలో కావాల్సినన్ని కష్టాలు ఉన్నాయి. కానీ, అన్నింటినీ అధిగమించి విజేతగా మారింది.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తే అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియగానే కన్నతండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అలేఖ్యను తీసుకుని లక్ష్మమ్మ పుట్టింటికి వచ్చేసింది. తల్లికి భారం కాకుండా అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమానూరు వసతిగృహంలో ఉంటూ.. ఆదర్శ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె పదో తరగతికి వచ్చేసరికి తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మానసికంగా కృంగి పోతారు. తమ కష్టం వినేవాళ్ల లేరే.. తనను ఆదుకునేది ఎవరూ అంటూ పెద్దవాళ్లు సైతం కంగారు పడతారు.
కానీ, అలేఖ్య మాత్రం కొండంత బాధను గుండెల్లోనే దాచుకుంది. ఎంతో కష్టపడి ఏప్రిల్ నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసింది. ఏదో మొక్కుబడిగా రాసి వచ్చేయడం కాదు.. 9.7 జీపీఏతో పరీక్షల్లో తన సత్తా చాటింది. అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు కొంత ఆర్థికంగా సహాయం చేశారు. భవిష్యత్ లో అలేఖ్య చదువుకు సంబంధించి కూడా తమవంతు సాయం చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్ లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. అలేఖ్య కుటుంబ నేపథ్యం, ఆమెకు ఎదురైన సమస్యలు, ఆమె సాధించిన విజయం తెలుసుకుని అంతా శభాష్ అంటున్నారు. అలేఖ్య సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలానే అలేఖ్య చదువుకు ఆర్థిక సాయం చేయాలనుకుంటే.. ఈ కింద ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌కి మీరు ఇచ్చే మొత్తాన్ని పంపండి.