ప్రాంక్ వీడియోలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ ఒక యూట్యూబర్ పై నెటిజన్స్ ఫిర్యాదు చేశారు. కొంతమందిని కారులో ఎక్కించుకుని వారిని భయపెడుతున్నాడని.. ఇలాంటి వీడియోల వల్ల ఒత్తిడి పెరిగి ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.
ప్రాంక్ వీడియోల పేరుతో కొంతమంది మరీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. సరదా కోసం చేస్తే పర్లేదు గానీ ఆ సరదా పరిధి దాటితేనే తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంది. ప్రాంక్ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ముద్దులు పెట్టడం, పిచ్చి పనులు చేయడం లాంటివి చేస్తున్నారు. కొన్ని ప్రాంక్ వీడియోలు ఐతే అశ్లీలంగా ఉంటున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ యూట్యూబర్ హర్రర్ సినిమా చూపిస్తున్నాడు. చిన్న పిల్లలను, పెద్దలను కారులో ఎక్కించుకుని భయాందోళనలకు గురి చేస్తున్నాడు. ఆఖరున ఇది ప్రాంక్ అని చెప్పి సరదాగా చేశా అని అంటున్నాడు. అయితే ఈ యూట్యూబర్ పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాంక్ వీడియోల పేరుతో పిల్లలను, పెద్దలను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరిఫ్ అనే యూట్యూబర్ పై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అతని యూట్యూబ్ ఛానల్ నిండా భయపెట్టే వీడియోలే ఉన్నాయని అంటున్నారు. లిఫ్ట్ పేరుతో పిల్లలను కారులో ఎక్కించుకుని శాడిజం చూపిస్తున్నాడని మండిపడ్డారు. కారు ఎక్కిన తర్వాత పిల్లల్ని కిడ్నాప్ చేశానని, నరబలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నా అంటూ భయపెడుతున్నాడని.. ఇలాంటి వీడియోలను ప్రోత్సహించకూడదని అంటున్నారు. ఆరిఫ్ ను అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. పిల్లల్నే కాదు, పెద్దలను కూడా ఇలానే భయపెడుతున్నాడని అంటున్నారు.
పాపులర్ అవ్వడానికి ఇలాంటి మార్గాలను ఎంచుకుంటూ.. చిన్న పిల్లలను టార్గెట్ చేసుకుని ఈ విధంగా వీడియోలు చేస్తున్న ఆరిఫ్ కు శిక్ష పడాల్సిందే అని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కి చెందిన వ్యక్తి పోలీసు శాఖ వారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రాంక్ వీడియోల వల్ల పిల్లల మానసిక స్థితి దెబ్బ తింటుందని భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. పిల్లలను విపరీతంగా భయాందోళనకు గురి చేస్తూ.. మిమ్మల్ని కిడ్నాప్ చేశాను, నరబలి ఇస్తాను అని చెప్పి మానసిక క్షోభకు గురి చేస్తున్న ఆరిఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పిల్లల మీద, పెద్దల మీద ఒత్తిడి అధికంగా ఉంటుందని.. సమాజం మీద ప్రతికూల ప్రభావం పడుతుందని.. ఇలాంటి ప్రాంక్ వీడియోలను సమర్థించకూడదని అంటున్నారు. మరి ఇలాంటి ప్రాంక్ వీడియోలను ప్రోత్సహించకూడదని చేస్తున్న కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.