ఈ ఏడాది సీనీ, రాజకీయ నేతలకు అస్సలు కలిసి రావడం లేదు. వరుస విషాదాలతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యె గడ్డం రుద్రమదేవి (65) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. దివంగత యన్టీఆర్ అభిమాని అయిన ఆమె ఆయన స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు యన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే గడ్డం రుద్రమదేవి ఆయన పిలుపు మేరకు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1980 లో 20 ఏళ్లకే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆమె కౌన్సిలర్ గా గెలుపొందారు. 1983 లో టీడీపీ తరుపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి అయిన గుత్త మోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాల మద్య ఆమె మరోసారి టీడీపీ తరుపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గుత్తా మోహన్ రెడ్డిపై గెలుపొందారు. అతి చిన్న వయసులోనే ఆమె ఎమ్మెల్యేగా గెలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
జిల్లా రాజకీయాల్లో సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె నేడు డిసెంబర్ 13న తుదిశ్వాస విడిచారు. రుద్రమదేవి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఆమెతో ఎంతో కాలం పాటు రాజకీయాల్లో పనిచేశామని.. ఒక మంచి నాయకురాలిని కోల్పోయమని పరామర్శించారు. గడ్డం రుద్రమదేవి మృతి పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.