తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుపుతున్నాయి. ఒకవైపు ఏపీలో అధికార వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల పోరు కోసం అన్ని ప్రధాన పార్టీలు అక్కడే తిష్టవేశాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ ప్రయత్నాలు మొదలుపెట్టగా, పోలీసులు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కారు కరీంనగర్ బీజేపీ కౌన్సిలర్ భర్తకు చెందినదిగా గుర్తించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను భారీగా నగదు పంపిణీ చేస్తున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ డబ్బు పట్టుబడటం మరింత చర్చనీయాంశమవుతోంది.
జిల్లాలోని మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన నేత వాహనం నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా గుర్తించారు. విజయవాడ నుండి ఈ నగదును తరలిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు, ఈ నగదును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మునుగోడులో ఉప ఎన్నికల పోరు మొదలైన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లకూడదు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది.