తెలంగాణలోని మహబూబబాద్ జిల్లా మరోసారి నాయకుల విభేదాలు బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాల్లో భాగంగా రైతులు యాసంగిలో పండించిన ధాన్యంను కేంద్రం కొనుగోలు చేయాలంటూ నిరసన తెలిపే సమయంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయకుల మద్య వివాదం చోటు చేసుకుంది.
రైతుల కోసం పోరాటం చేయాలని.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేర మానుకోట ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. అదే వేధికపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. కేంద్ర వ్యవహరిస్తున్న తీరు గురించి ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతున్న సమయంలో శంకర్ నాయక్ అక్కడకు వచ్చి ఆమె వద్ద నుంచి మైక్ లాగేసుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి ఎంపీ కవిత ఒక్కసారే ఆశ్చర్యపోయారు.
ఈ గొడవ మొత్తం మంత్రి సత్యవతి రాథోడ్ ముందే జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక మహిళా ఎంపికి ఇది ఘోర అవమానం అంటూ ఎమ్మెల్యే ప్రవర్తన జిల్లా అధ్యక్షురాలు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. గతకొంత కాలంగా ఈ ఇద్దరు నేతల మద్య జరుగుతున్న వివాదం ఇప్పుడు బహిరంగంగానే కనిపించిందని కార్యకర్తలు అనుకుంటున్నారు.