అల్లరి చేస్తున్నాడన్న కారణంగా లోకం తెలియని 8 ఏళ్ల కుమారుడ్ని ఒక కన్న తల్లి వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రామాంతపూర్ కి చెందిన అంబికకు మణికంఠ అనే 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో ఆమె శ్రీను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. అయితే మణికంఠ బాగా అల్లరి చేస్తున్నాడని, తన మాట వినడం లేదని, ఎదురు తిరుగుతున్నాడని ఆ తల్లి విసిగిపోయింది. ఇక ఆ బాబుని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా భర్త శ్రీనుతో కలిసి మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్ళింది. అంబికా, శ్రీను మణికంఠను భద్రాచలం వెళ్లే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఎక్కించారు. “పోయి ఎక్కడైనా బతుకు.. పెరిగి పెద్దయ్యాక తిరిగి రా” అంటూ చెప్పి రైలు ఎక్కించింది ఆ మహా తల్లి.
దానికి ఆ బాబు సరే అని రైలు లోపలికి వెళ్ళాడు. రైలులో ఒక్కడే బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాడు. ఒంటరిగా ఉన్న బాలుడ్ని చూసిన ప్రయాణికులు తప్పిపోయాడన్న అనుమానంతో ఘన్ పూర్ పోలీసులకు అప్పగించారు. బుధవారం బాలుడి తల్లిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లాడ్ని తీసుకెళ్ళమని పోలీసులు కోరారు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో పోలీసులు ఆ బాబుని చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “బాబు అల్లరిని భరించలేక పెద్దయ్యాక తిరిగి రా అంటూ చెప్పి మరీ రైలు ఎక్కించింది. ఏ సూపర్ స్టారో అయితే మా బాబే అని దగ్గరకు తీసుకుంటుందా? అల్లరి చేస్తే దూరంగా విసిరేస్తుందా? ప్రపంచంలో ఏ తల్లి ఇలా ఉండదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొడుకుని వదిలించుకున్న ఈ మహా తల్లిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.