నవమాసాలు మోసి కన్న తల్లికి అన్నం పెట్టడానికి కొడుకులకు మనసు రాలేదు. రెండు నెలలుగా ఇదే తంతు. దీంతో ఆ తల్లి భిక్షాటన చేసుకుని కడుపు నింపుకుంది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
తల్లిదండ్రుల పేరు మీద ఆస్తి, భూమి ఉన్నంత వరకే వారికి విలువ. పొరపాటున వారి పేరు మీదున్న ఆస్తులను పిల్లల పేరు మీద రాశారో ఇక అంతే సంగతులు. ఒక పూట బువ్వ కోసం పిల్లల దగ్గర చేతులు చాచి అడుక్కోవాల్సిందే. ఇంట్లో పెద్ద దిక్కు అయిన తండ్రి చనిపోతే ఇక తల్లి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కోడళ్ళు కూడా ఆమె దగ్గర ఆస్తి ఉన్నంతవరకే అన్నం పెడతారు. ఒకసారి ఆస్తి తమ చేతికొచ్చాక అన్నం పెట్టడమే మానేస్తారు. ఆస్తి రాయించుకుని తల్లులను ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు, అత్తగార్లను బయటకి పంపించేసి కోడళ్ల గురించి గతంలో వార్తల్లో చూసాం. దీంతో చాలా మంది వృద్ధులు రోడ్డు మీద భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నారు.
తాజాగా ఓ వృద్ధురాలు తన కొడుకులు చూడడం లేదని ఆకలికి ఆగలేక భిక్షాటన మొదలుపెట్టింది. ఆత్మాభిమానం చంపుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని జగ్నా తాండాకు చెందిన ఇస్లావత్ జాంకీ అనే మహిళ తనను తన కొడుకులు పట్టించుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. తన భూమి రాయించుకుని తనకు అన్నం పెట్టడం లేదని వాపోయింది. జాంకీ, చంద్రు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఐదేళ్ల కిందట చంద్రు మృతి చెందాడు. దీంతో కొడుకులు తనను పోషిస్తారన్న నమ్మకంతో ఎకరం భూమిని వారిద్దరికీ పంచింది.
కాగా కొడుకులు, కోడళ్ళు ఇక నీతో పని ఏముంది అని ఆమెను గాలికి వదిలేశారు. రెండు నెలలుగా ఆమెకు అన్నం పెట్టడం మానేశారు. దీంతో ఆమె ఆకలికి ఆగలేక కడుపు నింపుకోవడం కోసం రోడ్ల మీద యాచిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు, గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. జాంకీ ఫిర్యాదు మేరకు ఆమె కొడుకులను పిలిచి మాట్లాడతామని బయ్యారం పోలీసులు తెలిపారు. మరి కన్న తల్లికి 2 నెలలుగా అన్నం పెట్టని ఈ కొడుకులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.