ప్రమాదాలు ఎప్పుడు ఏ సమయంలో.. ఎటువైపు నుంచి వస్తాయో తెలీదు. ఇక అక్కడ ప్రమాదం జరగబోతుంది.. అని తెలిస్తే! మనం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. పరుగులు పెడుతూ.. మన ప్రాణాలు దక్కించుకోవాలని చూస్తాం. తమ ప్రాణాలను దక్కించుకోవాలని ప్రయాణికులు పరుగులు తీసిన సంఘటన తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఒక్కసారిగా MMTS రైళ్లో నుంచి భారీ శబ్దాలు రావడంతో.. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇండియన్ రైల్వే.. దేశంలోనే అతిపెద్ద జనాభా రవాణా సంస్థల్లో ఒకటి. సుదూర ప్రయాణికులను వారివారి గమ్యాలకు చేర్చడంలో కీలక పాత్ర వహిస్తోంది. అయితే జనాభా పెరగడంతో పట్టణాల్లో సైతం లోకల్ ట్రైన్ లను నడుపుతున్నారు. ప్రయాణికులను వారి గమ్యాస్థానాలకు చేర్చడంలో లోకల్ ట్రైన్ లది కీలక పాత్ర. అయితే ఈ క్రమంలోనే బేగంపేట్-నక్లెస్ రోడ్డు మార్గం మధ్యలో నడిచే MMTS కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి నుంచి బయలు దేరిన ట్రైన్ బేగంపేట్-నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చే సరికి భారీ శబ్దాలు వచ్చాయి. దాంతో ప్రయాణికులు అందరు భయంతో ట్రైన్ లో నుంచి దూకి పరుగులు తీశారు.
అయితే లోకోపైలట్ మరో సారి ట్రైన్ ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా.. మళ్లీ అదే రీతిలో శబ్దాలు వచ్చాయి. దాంతో రైలును అక్కడే 40 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇక ఈ సంఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఎంఎంటీఎస్ రైలు సాంకేతిక లోపంతోనే ఆగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని స్పష్టం చేశారు. అధికారులు పునరుద్దరణ పనులు చేపట్టిన తర్వాత.. రైళ్లు యథావిధిగా నడుస్తున్నయని అధికారులు తెలిపారు. అయితే గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. అధికారులు లోపాలను సవరించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని వారు కోరుతున్నారు.