ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్య మహిళలకే కాదు ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా వచ్చిపడుతున్నాయి. అసభ్యకరమైన వీడియోలు, ఫోటో మార్ఫింగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన న్యూస్, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొంతమంది కేటుగాళ్లు సెలబ్రెటీల ఫోటోలు మార్పింగ్ చేయడం.. అసభ్యకరమైన వీడియోలు ఎడిట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో సదరు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి పోస్ట్ చేసిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. సామాన్య మహిళలే కాదు.. సెలబ్రెటీలను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. ఓ వ్యక్తి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై అసభ్య పదజాలం వాడుతూ… ఆమె ఫోటోలు మార్పింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొంతకాలంగా ఎమ్మెల్సీ కవితపై ఆ వ్యక్తి ట్రోల్స్ చేస్తూ వచ్చాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ డీఐ రవిందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామానికి చెందిన బొల్లి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసిన వీడియోని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఈ నెల 20న బీఆర్ఎస్ నాయకులు గచ్చీబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పపడినట్లు గుర్తించారు. నింధితుడిని అరెస్ట్ చేసి కస్టడికి తరలించినట్లు పోలీస్ డిటెక్టీవ్ ఇన్స్ పెక్టర్ రవీందర్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడు సార్లు విచారించారించిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్చి 15 న ఆమె తరుపు లాయర్లు పిటీష్ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని మహిళా బిల్లు తీసుకు రావాలంటూ ఉద్యమం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత.