ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పది, ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని.. ఫెయిల్ అయ్యామని ఆవేదనతో క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమంది విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగుల్చుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు బలవన్మరణానికి దారి తీస్తున్నాయి. ఓ ఇంటర్మీడియేట్ విద్యార్థిని తక్కువ మార్కులు వచ్చాయని నేరుగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి విద్యార్థిని ఆవేదనకు ఎలా స్పందించారో వివరాలలోకి వెళితే..
రాత్రి 11.15 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఇంటర్ విద్యార్థిని ఫోన్ చేసింది. ‘మేడం మాది మహబూబ్ నగర్ జిల్లా. నేను హైదరాబాద్ లో ఉండి చదువుకుంటున్నాను. నాకు ఇంటర్ లో తక్కువ మార్కులు వచ్చాయి. చాలా బాధగా ఉంది. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుంది. ఏం చేయాలో తోచడంలేదు. నన్నేం చేయమంటారు?’ అంటూ తన ఆవేదన తెలిపింది. వెంటనే మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదని, బంగారు భవిష్యతును నిర్మించుకోవాలని నచ్చజెప్పింది. గొప్ప వ్యక్తులందరు ఓటమిని చవిచూసినవారేనని, కృషి, పట్టుదలతో శ్రమించి ఉన్నత స్థానాలను అధిరోహించారని మంత్రి చెప్పారు.
చదువు పరీక్ష అనేవి జీవితంలో ఓ భాగమేనని, పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోయినట్లు కాదన్నారు. కొంతమంది ప్రముఖుల జీవిత విశేషాలను, వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న సంఘటనలను మంత్రి విద్యార్థినితో ప్రస్తావించారు. మీరు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలని ధైర్యం చెప్పారు. అడ్వాన్స్ సంప్లమెంటరీ పరీక్షలు వస్తున్నాయని కష్టపడి చదివి మార్కులు ఎక్కువ సాధించుకోవాలని నచ్చజెప్పారు. ఇలా కొంతసేపు మాట్లాడి విద్యార్థినికి ఎంతో ధైర్యం చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
‘ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. చిన్న వయస్సులో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చూసుంటే బాధనిపిస్తుంది. దయచేసి విద్యార్థులు తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల కష్టాలను గుర్తుతెచ్చుకోండి. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీకి సన్నద్ధం కావాలి’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు.