మల్లారెడ్డి సంస్థల అధినేత, తెలంగాణ కార్మిక-ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని వైద్యుడిని చేస్తే.. వైద్యురాలైన కోడలు గిఫ్ట్ గా వచ్చిందని, అదే రెడ్డి అమ్మాయితో వివాహం చేసుంటే.. పార్టీలు, పిక్నిక్ అంటూ తిరిగేదని వ్యాఖ్యానించారు. పిల్లలు ఆణిముత్యాలని.. పుట్టిన రోజు వేడుకలు, పిక్నిక్ లంటూ తల్లిదండ్రులే వారిని పాడుచేస్తున్నారన్నారు. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా.. ప్రేమ, స్నేహం వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పుకొచ్చారు. సోమవారం మల్లారెడ్డి విద్యాసంస్థల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐటీ దాడులతో ఇటీవల కాస్త నిరుత్సాహంగా కనిపించిన మంత్రి మల్లారెడ్డి.. ఇవాళ చాలా ఉత్సాహంగా కనిపించారు. తనంత అదృష్టవంతుడు ఎవరూ లేరన్న ఆయన.. కలలను సాకారం చేసుకున్నట్లు తెలిపారు. భూమిని అమ్మి కొడుకును డాక్టర్ చదివించానని, ఆ తర్వాత తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయ్యానన్నారు. తాను ఏదైనా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని, మనస్సులో ఏమీ దాచుకోనని తెలిపారు. తమ మెడికల్ కళాశాలలో డొనేషన్ సీట్లు లేవని, అన్నీ ఆన్ లైన్ ద్వారానే అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. అంతేకాదు.. తన కొడుకు సీటు కావాలని అడిగినా ఇవ్వనన్నారు.
కష్టపడితే జీవితంలో ఎవరైనా ఎదగవచ్చని, ప్రస్తుతం తాను 33 కాలేజీలు నడిపిస్తూ ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు తయారుచేస్తున్నానన్నారు. తనవద్ద ఎలాంటి బ్లాక్ మనీ లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. 400 మంది ఐటీ అధికారులు వచ్చి వారిపని వారు చేసుకుపోయారని, ఏమీ దొరక్కపోవడంతో నాపై నిరాధార ఆరోపణలు చేశారన్నారు. తాను క్యాసినో నడిపించడంలేదని, కాలేజీలు మాత్రమే నడిపిస్తున్నానని చెప్పుకొచ్చారు. తుఫాన్లు వచ్చినా తట్టుకునే ధైర్యం తనకు ఉందని, తాను అన్నీ సాధించానని, తనకు ఎలాంటి కోరికలు లేవని చెప్పారు. కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ ఇప్పటికీ తాను చిన్న ఇంటిలోనే నివసిస్తుంటానని, తనది చాలా సింపుల్ జీవితమని చెప్పారు. విద్యార్థులు తనను రోల్ మోడల్‌గా తీసుకోవాలని తెలిపారు.
నా కొడుకును పెళ్లి చేసుకోబట్టే కోడలు ఇట్లయింది : Minister Malla Reddy – TV9#MinisterMallaReddy #Telangana #TV9Telugu pic.twitter.com/m48UMVLmVP
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2022