తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం పదవి తన తనయుడికి అప్పజెప్పేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సీఎంగా ఎప్పుడు పగ్గాలు చేపడుతారన్న ప్రశ్నపై తనదైన స్టైల్లో జవాబు చెప్పారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ సీఎం కుర్చీపై స్పందించారు.
ప్రస్తుతం తాను టీఆర్ఎస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని.. సీఎం కావాలన్న కోరిక లేదని అన్నారు. ప్రతిపక్షాల వారు ప్రతిసారి ఇదో ప్రస్థావన తీసుకు రావడం పరిపాటైందని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయన నాయకత్వంలో తాము పనిచేస్తామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ది పనులు చేశారని అందుకు ప్రజలకు ఆయనపై ఎంతో నమ్మకం ఉందని అన్నారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నేతలు అసభ్య పదజాలంతో మాట్లాతున్నారని.. వ్యక్తిగతంగా దూషించడం చూసి కొన్ని సందర్భాల్లో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో అని అనిపిస్తోందన్నారు. ఇక కుటిల రాజకీయాలతో, మతాన్ని అజెండాగా పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు.