కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పారు. తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన నిలదీశారు. కనీసం ఈసారి బడ్జెట్‌లో అయినా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని, దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన చెప్పారు.
తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్‌టైల్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణతో పాటు ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు.. రాష్ట్రాలకు నిధులు విదల్చకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్రం సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన చెప్పారు. తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.