హైదరాబాద్- ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. భారతదేశంలో కూడా నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కేసులు సంఖ్య గణనీయంగా పేరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ లో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీరు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వర్ధంతి రోజే చంద్రబాబుకు కరోనా… విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి కరోనా కిట్ లు ఇవ్వాలని నిర్ణయించాము. గతంలో ఫీవర్ సర్వే మంచి ఫలితాలు ఇచ్చింది. అందుకే మరోసారి ఈ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కొంతమందిలో లక్షణాలు కనిపిస్తున్నా టెస్ట్ లు చేయించుకోవడం లేదు. కనుక ఇక నుంచి అన్ని విభాగాల అధికారులతో ఫీవర్ సర్వే చేయించనున్నాం. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వాక్సినేషన్ లో ముందు ఉందని.. మొదటి డోస్ 103 శాతం పూర్తి చేయగా.. రెండో డోస్ 77శాతం పూర్తి అయిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లోని బస్తి దవాఖానలో కూడా హోం ఐసోలేషన్ కిట్ లు ఇవ్వనున్నామని తెలిపారు. ఇక నుంచి ఆదివారం కూడా బస్తి దవాఖానలు పని చేస్తాయన్నారు. ఈ ఫివర్ సర్వే లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఫిబ్రవరి నెలలో జరగనున్న మేడారం జాతరపై కూడా దృష్టి పెట్టామని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : నాతో ఎన్టీఆర్ ఆత్మ ఎన్నో విషయాలను పంచుకుంది : లక్ష్మీ పార్వతి