మండి బిర్యానీ కల్చర్ ఈమధ్య బాగా పెరిగింది. సిటీ నుంచి విలేజ్ వరకూ మండి సెంటర్లు విస్తరిచాయి. అయితే అలాంటి ఓ మండి సెంటర్‌లో బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం ఏంటంటే..!
హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన బిర్యానీ టేస్ట్ చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనాలు భాగ్యనగరానికి వస్తుంటారు. ఇక్కడ టూరిజంకు వచ్చిన వాళ్లు బిర్యానీ రుచి చూడందే వెళ్లరంటే నమ్మండి. అయితే ఈ మధ్య మండి బిర్యానీ బాగా పాపులర్ అవుతోంది. ఒకేసారి నలుగురు అంతకు మించి కలసి ఒకే ప్లేట్‌లో తినే సౌలభ్యం ఉండటంతో మండి బిర్యానీ సెంటర్లు తక్కువ టైమ్‌లోనే ఫేమస్ అయిపోయాయి. ప్రస్తుతం మండి బిర్యానీ సెంటర్లదే హవా. హైదరాబాద్‌తో పాటు పల్లెలకూ మండి కల్చర్ పాకింది. అయితే అపరిశుభ్రత, నాణ్యతలేని వంటకాల వల్ల ఈ మండి సెంటర్లలో భోజనం చేసిన వారు అస్వస్థతకు గురవుతున్నారు.
తాజాగా మెదక్ జిల్లాలోని ఓ మండి బిర్యానీ సెంటర్‌లో బిర్యానీ తిన్న 12 మంది యువకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదక్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్, అరవింద్, పవన్‌లు ఈనెల 18న నర్సాపూర్‌లోని ఒక మండి సెంటర్‌లో బిర్యాని పార్శిల్ తీసుకెళ్లి తిన్నారు. ఆ తర్వాత వాళ్లు అస్వస్థతకు గురయ్యారు. నర్సాపూర్‌కు చెందిన అజీజ్ మరో ఆరుగురు స్నేహితులతో కలసి అదే రోజు అదే మండి హోటల్ బిర్యానీ తిన్నాడు. వాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు నర్సాపూర్‌కు చెందిన నాని, మహేశ్, షకీల్ అనే వ్యక్తులు కూడా బిర్యానీ తిని అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో కొందరు ఆస్పత్రుల్లో చేరగా.. మిగిలిన వారు ఇంటి వద్దే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఒకే రోజు ఒకే మండిలో బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురవ్వడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మండి వ్యవహారాన్ని జిల్లా వైద్యాధికారులకు తెలియజేశారు. దీంతో జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రంగంలోకి దిగారు. నర్సాపూర్‌లో ఉన్న మన్నత్ అరేబియన్ మండి హోటల్ నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. మండిలో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించడంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సునీతతో పాటు ఇతర అధికారులు హోటల్‌కు చేరుకున్నారు. హోటల్‌లో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. కొన్ని శాంపిల్స్‌ను తాము సేకరించామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతామని చెప్పారు. ఆ నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతోనే యువకులు అస్వస్థతకు గురయ్యారని స్పష్టం చేశారు.