ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితితో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, ప్రేమ, వివాహేతర సంబంధాలు.. ఇలా ఎన్నో విషయాల్లో తీవ్ర మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడులుకు తెగబడటం లేదా ఆత్మహత్యలకు పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువతి అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యింది. ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలిమ్ నగర్‌లోని బాల్‌రెడ్డి నగర్‌లో నివసిస్తున్న సాయి కృష్ణవేణి గత కొంతకాలంగా విప్రో సర్కిల్ లోని ఓ బ్యాంక్ లో పనిచేస్తుంది. కృష్ణ వేణికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ఈ నెల 1వ తేదీనీ కృష్ణ వేణి తన భర్త ప్రవీణ్ కుమార్ కి ఫోన్ చేసింది. తాను ఉద్యోగం మానివేశానని.. ఇంటి నుంచి వెళ్లిపోతున్నా చెప్పి కొద్ది సేపటి తర్వాత స్విచ్చాఫ్ చేసింది. ఆమె భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో భయపడిపోయాడు. ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. సన్నిహితులను, బంధువులకు ఫోన్ చేసి కృష్ణ వేణి గురించి ఆరాతీయగా రాలేదని సమాధానం వచ్చింది. దీంతో తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని కృష్ణ వేణి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.