హయత్‌నగర్‌లోని తొర్రూర్ రోడ్డు పక్కనే ఉన్న బాతుల చెరువులో మహిళ శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హయత్‌నగర్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం సమీపంలో డేగ శ్రీను(35), భార్య లక్ష్మీ(30) అనే దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను తన భార్య మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి తన స్నేహితుడు వినోద్‌తో కలిసి చెరువులో పడేస్తుండగా స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు.
అయితే వారిద్దరు ఆమెను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రచారం జరిగింది. కానీ పోలీసుల విచారణలో వారిద్దరూ చెప్పిన విషయాలు తెలిసి అందరికీ కంట తడి పెట్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ఈనకల్లు గ్రామానికి చెందిన డేగ శ్రీను 11 ఏళ్ల క్రితం బెంగళూరులో మేస్త్రీ పని చేస్తుండగా కర్ణాటకకు చెందిన లక్ష్మి(30)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక పాప.. బాబు ఉన్నారు. ఆరు నెలల క్రితం ఈ కుటుంబం హైదరాబాద్ లో బతకడానికి వచ్చారు. హయత్‌నగర్ పాతరోడ్డులోని హనుమాన్ మందిరం పక్కనే ఉన్న గల్లీలో అద్దెకుంటున్నారు. కొన్ని రోజుల వరకు వీరిద్దరూ రోజు కూలీ చేస్తూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీను భార్య లక్ష్మి అనారోగ్యంతో బాధపడూ వస్తుంది.. కొన్ని రోజులుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతూ.. అన్నం కూడా తినలేని పరిస్థితి వచ్చింది. శ్రీను గురువారం పని ముగించుకుని సాయంత్రం 7 గంటలకు ఇంటికొచ్చాడు.
అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న లక్ష్మి కొద్దిసేపటికే అతడి చేతుల్లోనే మరణించింది. ఆమెను ఖననం చేయడానికి కూడా డబ్బులు లేని దీన స్థితిలో ఉన్న శ్రీను దగ్గర్లోని బాతుల చెరువు వద్ద ఖననం చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో బంధువు కోడూరి వినోద్ సాయంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టుకొని చెరువు వద్దకు మోసుకెళ్లాడు. అక్కడే మృతదేహాన్ని పూడ్చి పెట్టే ప్రయత్నం చేస్తుండగా చుట్టు పక్కల వాళ్లు వారిని పట్టుకొని దాడి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి అనారోగ్యంతోనే చనిపోయినట్లు శుక్రవారం పోస్టుమార్టం అనంతరం నిర్ధారించారు. శ్రీను, లక్ష్మిల బంధువులను పిలిపించి మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.