లోన్ యాప్స్ నిర్వాహకులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో ఈ వ్యాపారాన్ని వారు వదులుకోవడంలేదు. గతంలో వీరి వేధింపులతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కొద్ది నెలల ముందు లోన్ యాప్ సంస్థలపై దాడులు చేయడంతో ఈ దందాకు కొంతకాలం తెరపడింది. అయితే.. మళ్లీ వెలుగులోకి వచ్చిన లోన్ సంస్థలు రుణ గ్రహీతలకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాయి. తాజాగా వీరి వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల, గోపాల్‌వాడకు చెందిన బొల్లు కళ్యాణి అనే మహిళ లోన్ యాప్ లలో లోన్లు తీసుకొని సరైన టైమ్ లో చెల్లించకపోయింది. ఈ క్రమంలో నిర్వాహకులు భారీ ఎత్తున ఫైన్ వేశారు. తీసుకున్న లోన్ కి భారీగానే వడ్డీలు చెల్లించింది. అయినా అప్పు తీరలేదు. దీంతో నిర్వాహకులు.. ఆమె ఫోన్ నుంచి యాక్సెస్ చేసుకున్న కాంటాక్ట్ నంబర్లు, వాట్సప్ గ్రూపుల ద్వారా ఆమెను బహిరంగంగా అవమానించటం మొదలుపెట్టారు. బంధువులకు ఫోన్లు చేసి వేధించడంతో పాటు .. ఆమె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి.. వాట్సాప్ చేశాడు ఓ యాప్ కీచకుడు. దీంతో అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్‌నోట్ రాసి.. బాత్రూంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కళ్యాణి చనిపోయిన గంట తర్వాత కూడా మళ్లీ లోన్ యాప్ నుంచి కాల్స్ వచ్చాయి. ఆమె చనిపోయిందంటే నమ్మని లోన్ యాప్ నిర్వాహకులు.. డెడ్‌బాడీ ఫొటోను వాట్సాప్ చేయాలని అడగడం వీరి పరాకాష్టకు అద్దం పడుతోంది.
ఇది కూడా చదవండి: Nalgonda: నెలరోజుల్లో పెళ్లి.. కాబోయే భర్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!
ఈ నేపథ్యంలో.. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ యాప్ బాధితులు ఎవరూ అధైర్య పడి, ఆత్మహత్యలు చేసుకోవద్దు. తగిన ఆధారాలతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే ..ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నా.. యువత మాత్రం బలవన్మరణాలకు పాల్పడుతూనే వున్నారు. అప్పుల విషయంలో జాగ్రత్తగా వుండాలని, గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే అప్పులు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయాలని మంచిర్యాల జోన్ ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ సూచించారు.