అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సర్జరీ చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఆ సర్జరీ ఏంటంటే..!
ఈ రోజుల్లో ఊబకాయం సమస్య సాధారంగా మారింది. సరైన సమయానికి తినకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటివి బరువు పెరగడానికి కారణాలుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీవన శైలి మార్పుల కారణంగా తక్కువ వ్యవధిలోనే చాలా మంది అధిక బరువు బారిన పడి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఓ 23 ఏళ్ల యువకుడు కూడా ఇలాగే అధిక బరువుతో బాధపడుతున్నాడు. ఊబకాయం కారణంగా తన పనులు తాను చేసుకోలేని స్థితికి చేరుకున్నాడు. అలాంటి వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసి ఉపశమనం కలిగించారు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు. 227 కిలోల బరువున్న యువకుడికి ఆపరేషన్ చేసి 180 కిలోలకు తగ్గించారు.
ఊబకాయంతో బాధపడుతున్న ఆ యువకుడికి సర్జరీ ద్వారా ఏకంగా 47 కిలోలు తగ్గించారు ఉస్మానియా డాక్టర్లు. వివరాలు.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు చెందిన మణీంద్ర సింగ్ అధిక బరువుతో బాధపడేవాడు. దీంతో మణీంద్రను పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్‌కు రూ.8 నుంచి రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని మణీంద్ర తండ్రి ఉస్మానియా డాక్టర్లను సంప్రదించారు. అతడ్ని పరిశీలించిన వైద్యులు.. బేరియాట్రిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గ్యాస్ట్రిక్ బైపాస్‌తో పొట్ట పరిమాణం తగ్గించారు. ఎక్కువ ఆహారం తీసుకోకుండా చిన్న పేగును కత్తిరించారు. ఊబకాయం ఉన్న వారికి గతంలో రిడక్షన్ సర్జరీ చేసేవారని.. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని డాక్టర్లు చెప్పారు.