ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాల్లో రిసార్టుల కల్చర్ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రిసార్టులు, అడ్వంచర్ క్లబ్ లు కూడా బాగా పుట్టుకొచ్చాయి. నగరవాసులు సైతం సెలవుల్లో ఆటవిడుపు కోసం ఈ రిసార్టులకు వెళ్లడం చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన వార్త ప్రస్తుతం అలా రిసార్టులకు వెళ్లే వారికి భయాందోళనకు గురి చేస్తోంది. సరదాగా గడిపేందుకు రిసార్టుకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి విగతజీవిగా మారాడు. రిసార్టు వాళ్లు నిర్వహించిన ఓ ప్రమాదకర గేమ్ వల్లే ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. పైగా ఆ రిసార్టు వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుమతి కూడా లేదని చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ లోని గోధుమగూడలో హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి దాదాపు 100 మంది రిసార్ట్స్ కి వెళ్లారు. ఈ అడ్వంచర్ క్లబ్ వాళ్లు మూన్ లైటింగ్ లో భాగంగా ఓ ప్రమాదకరమైన ఆటను పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఆట ఏంటంటే.. వాళ్లు కొన్ని వస్తవులను కొన్ని ప్రదేశాల్లో దాచిపెడతారు. వాటిని వీళ్లు బయటకు తీయాల్సి ఉంటుంది. అయితే బావిలో కొన్ని వస్తువులు దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఆ వస్తువులను తీసేందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయికుమార్(34) బావిలో దూకినట్లుసమచారం. సాయి కుమార్ కి ఇటీవలే బాబు కూడా పుట్టాడు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రిసార్ట్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సాయికుమార్ మృతదేహాన్ని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్ సరదాగా గడిపేందుకు సిటీ నుంటి ఇలా చాలా మంది వస్తుంటారని చెబుుతున్నారు. వారికి థ్రిల్ ఇచ్చేందుకు ప్రమాదకర ఆటలను ఆడించి రిసార్ట్స్ వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు సైతం కోరుకుంటున్నారు.