అన్ని అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేక ఎంతో మంది యువకులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతుంటారు. కానీ కొందరు ప్రబుద్దులు మాత్రం అడ్డదారుల్లో దొంగ సర్టిఫికెట్లను సృష్టించి వాటితో అనేక మోసాలకు పాల్పడుతుంటారు. ఆ నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలను సైతం పొందుతున్నారు. అచ్చం అలానే ఓ వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగం సంపాంచాడు.ఏకంగా 30 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. చివరికి సీబీఐ అధికారుల విచారణలో దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని జీఎస్టీ అండ్ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ గా సంజయ్ శాంతారాం పాటిల్ పనిచేస్తున్నారు. అతడు ముంబయి కస్టమ్స్ విభాగంలో 1990 డిసెంబరు 21వ తేదీన కస్టమ్స్ ప్రివెన్షన్ అధికారిగా ఉద్యోగంలో చేరాడు. సంజయ్ శాంతారాం విద్యార్హత పత్రాలు నకిలీవని సంజయ్ జాదవ్ అనే వ్యక్తి 2015 జులై 17న ముంబయిలోని అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుగుతుండగానే సంజయ్ పాటిల్ కి పదోన్నతి లభించింది. అనంతరం ముంబయి నుంచి హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా పాటిల్ సమర్పించిన పత్రాలను కస్టమ్స్ విజిలెన్స్ విభాగం అధికారులు పరిశీలించారు.
రాంచీ యూనివర్శీటి జారీ చేసినట్లు చెబుతున్న డిగ్రీ విద్యార్హత పత్రంలో పాటు మిగిలి పత్రాలు కూడా ఫేక్ అని తేలింది. దీంతో 2019 ఏప్రిల్ 26న ఉన్నతాధికారులు శాంతారాం ను సస్పెండ్ చేశారు. అతడిపై తదుపరి చర్యల కోసం హైదరాబాద్ కస్టమ్స్ కార్యాలయానికి చెందిన అదనపు కమిషనర్ సూర్యతేజ హైదరాబాద్ లోని సీబీఐ విభాగానికి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణలో సంజయ్ పాటిల్ ధ్రువపత్రాలన్నీ ఫేక్ అని తేలింది. దీంతో సీబీఐ అధికారు అతడిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.