గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అంగవైకల్యంతో ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడరాదని అధికారులు డ్రైవర్లకు అవ గాహన కల్పిస్తున్నారు. కానీ కొంతమంది తీరు మార్చుకోవడం లేదు. పోలీసులు ఇప్పుడు రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఏ కారణం చేతనైనా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినట్లయితే.. మోటారు వాహన చట్టం సెక‌్షన్ 185 ప్రకారం 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి నడపడం వల్లనే అని అంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ తాగి వాహనాలు నడిపే వారికి భారీగానే జరిమానా విధిస్తున్నారు. అంతే కాదు కొన్నిసార్లు జైలుకు కూడా పంపుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకుంటున్నా.. కొంత మంది మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ సిబ్బందికి దొరికిపోయాడు. సదరు వ్యక్తికి ఇది మొదటిసారి కాదు.. ఇప్పటికే మూడు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పిర్జాదీగూడకు చెందిన నవీన్ అనే వ్యక్తి 2016లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. మొదటిసారి అని అతనికి జరిమానా విధించి పంపారు. 2017 లో మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతనిని నాలుగు రోజులు జైలు శిక్ష విధించారు. 2019 లో మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పుడు మూడు రోజులు జైలు శిక్ష విధించారు. ఇలా తీరు మార్చుకోని నవీన్ మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. ఈసారి జరిమానా కట్టలేదు. దీంతో 34 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రతిసారి పట్టుపడుతున్న నవీన్ వ్యవహారంపై జడ్జీ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మద్యం సేవించి ఎదుటి వారి ప్రాణాలకు గండంగా మారుతున్న ఇలాంటి వ్యక్తులకు మరింత కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.