Mahabubabad Old Man Begging In Own Village Over Son Rejecting For Maintenance: సాధారణంగా తల్లిదండ్రులు అంటే.. బిడ్డల బాగోగుల కోసం నిత్యం శ్రమిస్తారు. తాము పస్తులుండి మరి పిల్లల కడుపు నింపుతారు. వారికి చిన్న ఆపద వస్తే.. విలవిల్లాడతారు. బిడ్డలకు మంచి జీవితం ఇవ్వడం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు. ఇంత చేసి బిడ్డలను జీవితంలో స్థిరపడేలా చేసిన తల్లిదండ్రులకు చివరకు కనీసం పట్టెడన్నం పెట్టడానికి కూడ వెనకాడతారు కొందరు. తల్లిదండ్రులు తమ కోసం చేసిన త్యాగాలను మర్చిపోయి.. వారిని రోడ్డున పడేస్తారు. జీవితాంతం కష్టపడి బిడ్డలను ప్రయోజకులను చేసి.. వారు జీవితంలో స్థిరపడితే.. ఇక చివరి దశలో మనవలు, మనవరాళ్లు, పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని భావిస్తారు. కానీ చాలామంది తల్లిదండ్రుల విషయంలో ఇది అత్యాశే అవుతుంది. తమ కోసం జీవితాన్ని ధారపోసిన తల్లిదండ్రులను వృద్ధాప్య దశలో బాగా చూసుకోవాల్సింది పోయి.. అనాథలను చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. 25 ఎకరాల ఆసామి.. ఐదుగురు సంతానం.. కానీ ఆఖరి రోజుల్లో ఆ తండ్రికి పట్టెడన్నం పెట్టడానికి బిడ్డలకు మనసు రాలేదు. దాంతో ఆ తండ్రి మనసు చంపుకుని భిక్షమెత్తుకుని కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ సింగారం గ్రామానికి చెందిన సూర్నపాక నాగయ్య, ముసలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాగయ్య కష్టపడి 25 ఎకరాల సాగు భూమి సంపాదించాడు. ముగ్గురు కూతుళ్లకు ఘనంగా పెళ్లి చేశారు. కొడుకులు రాందొర, అర్జున్‌బాబులకు చెరో 10 ఎకరాల సాగు భూమి పంచి ఇచ్చాడు. నాగయ్య, ముసలమ్మ దంపతులు తమ పోషణ కోసం 5 ఎకరాలు ఉంచుకున్నారు. గత ఏడాది భార్య ముసలమ్మ కరోనా మృతి చెందడంతో ఆమె బంగారం పంపకాల విషయాల్లో వివాదం నెలకొంది.
ఇది కూడా చదవండి: ఒంటి కాలిపై పాఠశాలకు! బాలిక కష్టం చూసి చలించిపోయిన మంత్రి KTR!
మరోవైపు నాగయ్య తన పోషణ కోసం కేటాయించిన భూమిని సైతం అతడి ఇద్దరు కుమారులే సాగు చేస్తున్నారు. అదంతా పోడు భూమి కావడంతో నాగయ్యకు రైతుబంధు రావడంలేదు. తల్లి బంగారం తమకు ఇవ్వాలని కూతుళ్లు పంచాయతీ పెట్టగా… ఆ బంగారం బ్యాంకు తనఖాలో ఉందని.. ఆ అప్పు చెల్లించి దాన్ని తీసుకోవాలని కొడుకులు చెప్పారు. అయితే తండ్రి పోషణ కోసం కేటాయించిన భూమిలో కొంత అమ్మి బంగారం విడిపించాలని పెద్దమనుషులు సలహా ఇచ్చినా కుమారులు అంగీకరించలేదు.
ఈ వివాదం నేపథ్యంలో నాగయ్య కొడుకుల దగ్గర నుంచి వెళ్లిపోయి అదే గ్రామంలో ఉంటున్న కూతురు ఇంటికి చేరాడు. ప్రభుత్వం ఇచ్చే ఆసరాక పింఛన్ ఖర్చులకు సరిపోకవడంతో కూతురిపైనే ఆధారపడుతున్నాడు. అయితే ఆమె కూడా పేదరికాన్ని అనుభవిస్తుండటంతో భారం కాకూడదనుకున్న నాగయ్య గ్రామంలోనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పరిస్థితి గురించి రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: దిగ్గజ చెఫ్ లను కాదని.. మోదీకి యాదమ్మ చేతి రుచులు! ఇంతకీ ఈమె ఎవరు?
మరోవైపు నాగయ్య ఇద్దరు కుమారుల వాదన మరోలా ఉంది. బ్యాంకులో రూ.4 లక్షల అప్పు కోసం బంగారం తనఖా పెట్టారని.. అంత సొమ్ము చెల్లించి తమ ఆడపడుచులకు బంగారం ఎలా ఇవ్వగలమని వారు పేర్కొంటున్నారు. పెద్దమనుషుల తీర్పు అంగీకరించలేదన్న కారణంతో తమను కులబహిష్కరణ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఐదు గ్రామాల పెద్దలు నచ్చజెప్పినా వారు పట్టించుకోకపోవడంతో వివాదాన్ని వారి ఇష్టానికి వదిలేశామని పెద్దమనుషులు చెబుతున్నారు. ఈ వివాదం తమ దృష్టికి వచ్చిందని… పెద్దమనుషుల్లో చర్చించుకుని పరిష్కరించుకుంటామని చెప్పడంతో తాము కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా నాగయ్య సమస్యకు పరిష్కారం లభించి.. ఆయన కష్టం తీరుతుందో లేదో చూడాలి అంటున్నారు స్థానికులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Video: ఆటో ఎక్కి అల్లు అర్జున్ స్టైల్లో స్టంట్! కానీ.., లాస్ట్ లో అదిరిపోయే ట్విస్ట్