ఈఎంఐ చెల్లించలేదని రైతు ఇంటికొచ్చి దౌర్జన్యంగా ప్రవర్తించారు బ్యాంకు అధికారులు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈఎంఐలు చెల్లించలేదని బ్యాంకు ఆఫీసర్స్ రెచ్చిపోయారు. ఏకంగా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు. ఈఎంఐ డబ్బులు కట్టలేదని ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మదనాపురం గ్రామంలోని మోహన్ అనే రైతు 2021లో క్రాప్ లోన్ తీసుకున్నాడు. అయితే హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మోహన్.. గత మూడ్నెళ్ల నుంచి ఈఎంఐ చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఆఫీసర్స్ చర్యలకు ఉపక్రమించారు. మోహన్ హైదరాబాద్‌లో ఉండటంతో.. మదనాపురంలో ఉంటున్న ఆయన కొడుకు, గ్రామా మాజీ సర్పంచ్ వీరేందర్ ఇంటికి వెళ్లారు.
వీరేందర్ ఇంటికి వచ్చిన బ్యాంకు మేనేజర్, ఇతర సిబ్బంది అతడి వాగ్వాదానికి దిగారు. వీరేందర్ ఇంటి తలుపులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్ ఆటోలో ఎక్కించి వాటిని బ్యాంక్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు.. బ్యాంకు మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సామాగ్రిని వీరేందర్‌కు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. దీంతో వాళ్లు తలుపులను అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు ఫైర్ అవుతున్నారు. బ్యాంకు అధికారులు వడ్డీ వ్యాపారుల్లా ప్రవర్తించడంపై సీరియస్ అవుతున్నారు. ఈ ఘటన మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.