ధనమేరా అన్నింటికీ మూలం అని ఓ సినీ కవి రాసినట్లు, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యానికైనా తెగిస్తున్నారు. అక్రమ మార్గాలు, అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ దుడ్డు కోసమే అయిన వారు సైతం మానవ బాంధవ్యాలు మర్చిపోతున్నారు. బావమరిది బావ బతుకు కోరతారంటారు. కానీ ఈ బావమరిది కాసుల కోసం కక్కుర్తి పడి బావనే కిడ్నాప్ చేశాడు. అయితే ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కిడ్నాప్ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. యూసఫ్ గూడ నవోదయ కాలనీకి చెందిన బీవి మురళీకృష్ణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సొంతంగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. గత నెల 27న పిల్లలను పాఠశాలలో దింపి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు, తాము ఐటి అధికారులమంటూ తమ వాహనంలో ఎక్కించుకున్నారు. ఫోన్ లాక్కొని నగర శివారు బాటసింగారం వద్దకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు. అనంతరం మీ బావమరిది రాజేష్ కూడా తన వద్దే ఉన్నాడని పేర్కొంటూ ఫోన్లో మాట్లాడించారు. రాజేష్ ద్వారానే రూ. 30 లక్షలు తెప్పించి, వారికి అప్పగించారు. ఆ తర్వాత మురళీ కృష్ణను ఓఆర్ఆర్ వద్ద వదిలేశారు. ఈ విషయాన్ని ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్స్, సిసిటివి ఫుటేజ ఆధారంగా.. నిందితుడు బావమరిది రాజేష్ అని తేల్చారు.
అయితే పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.. అసలు విషయాన్ని కక్కాడు. తన కుమార్తె గుండె ఆపరేషన్ నిమిత్తం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పాడు. మురళీ కృష్ణ, ఆయన భార్య ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావడం, బావ కన్సల్టెన్సీ కూడా నడుపుతుండటంతో వారి దగ్గర బాగా డబ్బు ఉంటుందని ఊహించిన బావ మరిది ఈ పన్నాగం పన్నాడు. విజయవాడలో బంధువైన డి.రాఘవేంద్రను సంప్రదించారు. అతడు మరో నలుగురు నాగజీవన్ కుమార్, అబ్దుల్ సలీం, పి. లక్ష్మయ్య, ఎ.కృష్ణ గోపాల్, వాసు, గౌస్ లకు విషయాన్ని వివరించాడు. పని పూర్తయ్యాక డబ్బులు వాటాలు వేసుకుందామన్న ఒప్పందంపై ఈ నాటకానికి తెరలేపారు.
అనుకున్నట్లే మురళీ కృష్ణను కిడ్నాప్ చేసి తొలుత రూ. 60 లక్షలు డిమాండ్ చేయగా.. అతడి భార్య రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు తీసుకుని ఆమె భర్తను విడిచిపెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సిసిటివి, ఫోన్ కాల్స్ ఆధారంగా బావమరిది రాజేష్ పనేనని తేల్చారు. రాజేష్ కు సహకరించిన నిందితులను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల్లో గౌస్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వారి దగ్గర నుండి రూ. 15 లక్షల నగదు, ఇన్నోవా కారు, బుల్లెట్ వాహనం, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కోసం మానవతా విలువలను మర్చిపోతున్న ఇటువంటి ఘటనలు జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండ