అతడు నిత్య పెళ్లి కొడుకు. మహిళల్నిమభ్య పెట్టి వివాహం చేసుకోవడం, అందినదంతా వారి నుండి దోచుకోవడం, అక్కడ నుండి పరారయ్యి, మరో మహిళకు వలపు వలవేసి, పెళ్లి చేసుకోవడం అతడికి పరిపాటిగా మారింది. అలా ఐదుగుర్ని వివాహం చేసుకున్నాడు. అతడి ఆటలూ ఎప్పుడూ ఒకేలా సాగవుగా. భర్త కనిపించడం లేదంటూ భార్యలు పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లడంతో అతడి గుట్టురట్టయింది.
ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. తమ భర్త కనిపించడం లేదంటూ ఫోటో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చారు బాధిత మహిళలు. ముందుగా బంజారా హిల్స్, సనత్ నగర్ లో తొలుత పోలీసు కేసులు నమోదయ్యాయి. పలు స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిని విచారిస్తున్న పోలీసులకు.. ఆ తప్పిపోయిన వాడు ఒక్కరేనని గుర్తించారు. ఈ ఐదుగురు మహిళలకు ఒక్కడే భర్త అని తేల్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు మహిళల్ని ప్రేమ పేరుతో మభ్యపెట్టి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
పెళ్లి అనంతరం వీటి దగ్గర ఉన్న విలువైన నగలు, వస్తువులు తీసుకుని ఉడాయించాడు. ఇలా ఐదుగుర్నివివాహం చేసుకున్నాడు. ఒక రోజు చెప్పా పెట్టకుండా మాయమై, తిరిగి రాలేదు. దీంతో తమ భర్తను వెతికిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్లలో భార్యలు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. వీరందరికీ ఒక్కడే భర్త అని తేలింది. భార్యలంతా ఒక్కటై ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తమ భర్తను వెతికే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆ నిత్య పెళ్లి కొడుకును పట్టుకునే పనిలో పడ్డారు.