మెట్రో.. భాగ్యనగరం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన ప్రాజెక్ట్. 71 కిలోమీటర్ల పొడవుతో, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్‌తో హైదరాబాద్ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. మొదట్లో రోజుకి 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తూ.., ఈ ప్రాజెక్ట్ కాసులు కురిపించింది. కానీ.., తరువాత కాలంలో హైదరాబాద్ మెట్రో నష్టాల బాట పట్టింది. కోవిడ్ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రంహోమ్ చేయడం మెట్రోకి తీరని నష్టాలనే మిగులుస్తున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో నష్టాలు 1766 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టీ కంపెనీ నష్టాల బాటలో ఉన్న ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని సంస్థాపరంగా సంచలన నిర్ణయం తీసుకుంది.
పంజాబ్‌లోని పవర్ ప్రాజెక్టు సహా హైదరాబాద్ మెట్రోలోని 15 శాతం వాటాలను అమ్మకానికి పెట్టేందుకు ఎల్ అండ్ టీ కంపెనీ సిద్ధమయ్యింది. తమ వాటాల కొనుగోలుకు గ్రీన్‌కో కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఎల్ అండ్ టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఆ వార్తలపై గ్రీన్‌కో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు కాబట్టి ఇలా ఎల్ అండ్ టీ వారి ఇష్టానికి తమ వాటాలను అమ్ముకోవడం సాధ్యం కాదు. కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఎల్ అండ్ టీ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని మెట్రో అధికారులు చెప్తున్నారు.