నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి ఘటన కలచి వేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో నాన్న, సోదరితో కలిసి బయటకు వెళ్లిన బాలుడు.. వీధి శునకాల దాష్టీకానికి బలయ్యాడు. ఈ ఘటనపై తెలంగాణ బీఆర్ఎస్ ఐటి శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు.
ఆదివారం సెలవు కావడంతో నాన్న, సోదరితో కలిసి బయటకు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి.. ఇంటికి శవమై తిరిగొచ్చాడు. వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడ్ని వీధి కుక్కలు.. వెంటాడి, మూకుమ్మడి దాడి చేసి, నోట కరిచాయి. ఆసుప్రతికి తీసుకెళ్లే లోపు చనిపోయాడు. ఈ ఘటనతో ఆ బాలుడి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కాగా, ఈ ఘటనపై బీఆర్ఎస్ ఐటి శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు.
ఈ ఘటన తాననెంతో బాధించిందని కెటీఆర్ అన్నారు. బాలుడి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుక్కల స్టెలిరైజేషన్ కోసం ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేర్ సెంటర్స్, బర్త్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ సిబ్బంది రెగ్యులర్ గా వీధి కుక్కలను పట్టుకుని తీసుకెళుతున్నారని చెప్పారు. వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నామని చెప్పారు. తాము జంతువుల విషయంలో కూడా మానవులను ట్రీట్ చేసిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కానీ ఈ ఘటన తనను కలిచి వేసిందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.