తెలంగాణలో త్వరలో రాజకీయాలు మారబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. దానికి కారణం తెలంగాణ మంత్రులు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలే. అవేంటంటే? తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అనే నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా అవతరించిన సంఘతి మనకు తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను చేతబూని జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. దాంతో తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. ఇక ఈ ప్రశ్నకు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న సమాధానం ఒక్కటే తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ.. తాజాగా భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, హన్మకొండ సభల్లో ఎమ్మెల్యేలు కాబోయే సీఎం కేటీఆర్ అని ప్రకటించడమే.
KTR.. సీఎం కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, తన వాక్ చాతుర్యంతో, డైనమిక్ లీడర్ షిప్ తో తనకంటూ రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అని 2018 నుంచే వాదనలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో మరికొందరు వేరే వాదనలు వినిపించారు. ప్రభుత్వ వ్యతికేక తుపాను హెచ్చరికలు రావడంతో అప్పటికి సీఎం ఎవరు అనే ప్రశ్నను అలా వదిలేశారు. తాజాగా మరోసారి తెలంగాణ నెక్ట్స్ సీఎం మంత్రి కేటీఆర్ అన్న నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
తాజాగా హన్మకొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ..”తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారే. మీరందరు ఆయనకు గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి” అని కడియం శ్రీహరి ప్రకటించారు. అయితే ఈ స్టేట్ మెంట్ ను స్టేజ్ పై ఉన్న కేటీఆర్ సైతం ఖండించలేదు. దాంతో తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఒక్కరివే కాదు గతంలో భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్ సభల్లో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గండ్ర లు కూడా తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నారు అని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అందుకోసం ఇప్పటికే జాతీయ స్థాయి నేతలతో సమావేశాలు సైతం జరిపారు సీఎం కేసీఆర్. దాంతో ఈ వార్తలకు మరింతగా బలం చేకూరింది. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే కేటీఆర్ ని సీఎంగా ప్రకటిస్తున్నారా? అని కొందరు ప్రశ్నలని లేవనెత్తుతున్నారు. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను సరిదిద్దగల సమర్థుడు కేటీఆర్ అనే పార్టీ నాయకులు అంతా భావిస్తున్నట్లు సమాచారం. మరి తెలంగాణ నెక్ట్స్ సీఎం కేటీఆర్ అంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.